Hyderabad, December 22: తెలంగాణలో పల్లె ప్రగతి (Palle Pragathi) కార్యక్రమంపై సీఎం కేసీఆర్ (CM KCR) సమీక్ష నిర్వహించారు. పల్లె ప్రగతి పరిశీలన కోసం జనవరి 1 నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్స్ (Flying Squads) రంగంలో దిగుతున్నాయని తెలంగాణా (Telangana) సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి నివేదికలు ప్రభుత్వానికి సమర్పిస్తాయని వివరించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులతో తనిఖీ బృందాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
దిద్దుబాటు చర్యల కోసమే ఫ్లయింగ్ స్క్వాడ్లతో తనిఖీలు జరుపుతున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో పంచాయతీ రాజ్ శాఖను పటిష్టపరిచామని, ఇచ్చిన మాట ప్రకారం పల్లె ప్రగతికి ప్రతి నెల రూ.339 కోట్లు కేటాయిస్తున్నామని వెల్లడించారు. అలసత్వం వహిస్తే క్షమించేది లేదని, అధికారులు, ప్రజాప్రతినిధులకు ఇది పరీక్షలాంటిదని స్పష్టం చేశారు.
సెప్టెంబరులో 30 రోజుల పాటు నిర్వహించిన పల్లె ప్రగతి సత్ఫలితాలను ఇచ్చిందని, కార్యక్రమం జనాదరణ పొందిందని చెప్పారు. కాగా గ్రామాల్లో పచ్చదనం - పరిశుభ్రత పెంచడం లక్ష్యంగా తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ సర్కారు ఈ కార్యక్రమం చేపడుతోంది. పల్లె ప్రగతి కార్యక్రమంతో మంచి ఫలితం వచ్చిందని, మన ఊరిని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలనే అవగాహన ప్రజల్లో వచ్చిందని కేసీఆర్ గత రివ్యూ మీటింగ్‌లో అన్నారు.
ఈ స్ఫూర్తిని కొనసాగించడానికి భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. గ్రామాలు బాగుపడాలనే ఉద్దేశంతో గ్రామ కార్యదర్శి నుంచి జిల్లా పంచాయతీ అధికారి వరకు అన్ని ఖాళీలను భర్తీ చేసినట్లు సీఎం వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే మరోసారి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.