New Delhi, January 29: తెలంగాణలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిరంతర అమలు, నిర్వహణ కోసం మరియు ప్రతీ ఇంటికి తాగునీరు అందించే ప్రధాన వాటర్ గ్రిడ్ ప్రోగ్రాం మిషన్ భాగీరథ కోసం రాబోయే ఐదేళ్లకు 52,941.25 కోట్ల రూపాయలు కేటాయించేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని 15వ ఆర్థిక కమిషన్ కు సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఈ లేఖను రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్ రావు స్వయంగా 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్ కె సింగ్ కు అందజేశారు. ఈ సందర్భంగా లేఖలోని అంశాలను, నిధుల అవసరాన్ని మంత్రి హరీశ్ వారికి వివరించారు.
ఆర్థిక సంఘం కేంద్ర ప్రభుత్వానికి తమ నివేదిక అందజేసే ముందు తెలంగాణలో ఉండే ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి అదనపు కేటాయింపులు జరపాలని సీఎం విన్నవించారు. కాళేశ్వరంలో 83 మీటర్ల నుంచి 618 మీటర్ల వరకు నీటిని ఎత్తిపోయాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు నిర్వహణ వ్యయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. నీళ్లకోసమే తెలంగాణ పోరాటం జరిగిందని లేఖలో గుర్తు చేసిన సీఎం కేసీఆర్, ఐదేళ్లలోనే కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ఎత్తిపోతల పథకాలు, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులు పూర్తి చేసినట్లు తెలిపారు.
ఈ ప్రాజెక్టుల నిర్వహణ కోసం రూ .40,169.20 కోట్లు, ఇంటింటికి తాగునీరు అందించే మిషన్ భగీరథకు రూ .12,772.05 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇంటింటికి తాగునీరు అందించే పథకాల కోసం అన్ని రాష్ట్రాలకు నిధులు ఇస్తుందని, తెలంగాణ మరియు గుజరాత్ రాష్ట్రాలు ప్రాజెక్టులు ముందే పూర్తిచేసినందున, ఈ రాష్ట్రాలు నష్టపోకుండా చూడాలని కేసీఆర్ కోరారు. అలాగే పథకాల విద్యుత్ బిల్లులు, ఉద్యోగుల జీతాలు, ఇతర ఖర్చులకు సంవత్సరాల వారీగా నిర్ధిష్ఠమైన కేటాయింపులు జరిగేలా సిఫారసు చేయాలని 15వ ఆర్థిక సంఘానికి సీఎం కేసీఆర్ తన లేఖ ద్వారా వివరించారు.
ముఖ్యమంత్రి తన రెండు పేజీల లేఖలో, గతంలో ఆర్థిక సంఘం ఛైర్మన్ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించినపుడు, ఇక్కడి మౌలిక సదుపాయాల కల్పన, నీటిపారుదల మరియు తాగునీటి సరఫరా కోసం రాష్ట్రప్రభుత్వం పెట్టిన పెట్టుబడులు, కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషిని ఎలా ప్రశంసించారో సీఎం కేసీఆర్ మరోసారి లేఖలో గుర్తుచేశారు.