Hyd, JUne 16: రాహుల్ ఈడీ విచారణ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. తెలంగాణ మహిళా కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు నేతృత్వంలో రాజ్ భవన్ ముట్టడి యత్నం (Congress Cadre Stage Protest at Raj Bhavan) జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తోన్న తీరుకి వ్యతిరేకంగా మహిళా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు.
బీజేపీ, టీఆర్ఎస్ ఒకేలా వ్యవహరిస్తున్నాయంటూ వారు మండిపడ్డారు. వారిని అడ్డుకున్న పోలీసులు, అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు ఇవ్వడం ఏంటంటూ ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. మహిళా దర్బార్ నిర్వహించడం కాదని, మహిళల సమస్యలను గవర్నర్ పరిష్కరించాలని వారు అన్నారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో రాజ్‌భవన్‌కు (chalo rajbhavan) చేరుకున్నారు. పోలీసులను కూడా పెద్ద సంఖ్యలో మొహరించారు. కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఖైరతాబాద్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు బైక్‌కు నిప్పుపెట్టి నిరసనకు దిగారు. బస్సుల రాకపోకలను కూడా అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు పలువురు ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ఆంక్షలను ధిక్కరించి కాంగ్రెస్ నేతలు రాజ్‌భవన్ వైపు దూసుకెళ్లారు. దీంతో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, గీతారెడ్డి, అంజన్‌కుమార్ సహా పలువురు నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
కాంగ్రెస్ ఆందోళనపై పోలీసులు సీరియస్ అయ్యారు. డీసీపీ జోయల్ డేవిస్ చొక్కా పట్టుకున్న భట్టి విక్రమార్క, ఎస్‌ఐ కాలర్ పట్టుకున్న రేణుకా చౌదరి సహా పలువురు కాంగ్రెస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేయనున్నట్లు సమాచారం. రేవంత్‌రెడ్డి రోడ్డుపై బైఠాయించడంతో కాంగ్రెస్ చేపట్టిన చలో రాజ్‌భవన్ ఉద్రిక్తంగా మారింది.