Hyd, April 7: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కాగా, రాష్ట్రంలో ఈ నెల నుంచి విద్యుత్ ఛార్జీలు సైతం పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్ ధరలు, విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనలకు ప్లాన్ చేశారు. అందులో భాగంగా గురువారం.. విద్యుత్ సౌధ, సివిల్ సప్లై కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆపై హౌస్ అరెస్ట్ నుంచి బయటకు వచ్చిన వీరు విద్యుత్ సౌధ గేటు బయట నిరసన తెలిపారు. విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో నేతల్ని మాత్రమే లోపలికి అనుమతించగా, కాంగ్రెస్ కార్యకర్తలు గేటు బయట ఆందోళనకు దిగారు.
విద్యుత్ సౌధ దగ్గర తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ నేతలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. విద్యుత్ సౌధ ముందు కాంగ్రెస్ నేతలు భైఠాయించారు. 10 మంది కాంగ్రెస్ నేతలు లోపలికి వెళ్లేందుకు పోలీసుల అనుమతి ఇచ్చారు. దాంతో ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ నేతలు విద్యుత్ సౌధ ముందు బైఠాయించారు. పోలీసులకు, కాంగ్రెస్ నేతలకు తోపులాట జరగడంతో కాంగ్రెస్ నాయకురాలు విద్యారెడ్డి కిందపడిపోయింది. దాంతో ఆమెకు గాయాలయ్యాయి. ఆమెను నిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు.