Telangana Coronavirus: తెలంగాణలో 10 వేలు దాటిన కరోనా కేసులు, కొత్తగా 891 మందికి పాజిటివ్‌‌గా నిర్ధారణ, 225కి చేరిన మరణాల సంఖ్య
COVID-19 Outbreak. | (Photo Credits: IANS)

Hyderabad, June 25: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు (Telangana Coronavirus) పదివేలు దాటేశాయి. తాజాగా 891 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో కేసుల సంఖ్య 10,444కి చేరింది. ఇందులో 5,858 మంది వివిధ ఆస్పత్రులు, హోం ఐసోలేషన్లలో చికిత్స పొందుతుండగా.. 4,361 మంది కోలుకుని డిస్చార్జ్‌ అయ్యారు. మరో ఐదుగురు మరణించడంతో ఇప్పటివరకు కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 225కి పెరిగింది.  ఒక్కరోజే రికార్డు స్థాయిలో 16,922 కేసులు, దేశంలో 4,73,105కు చేరిన కోవిడ్-19 కేసులు సంఖ్య, నెల రోజుల్లోనే మూడు లక్షల యాభైవేల కేసులు నమోదు

తాజాగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో (COVID-19) అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 719 ఉండగా.. రంగారెడ్డి జిల్లాలో 86, మేడ్చల్‌ జిల్లాలో 55, కొత్తగూడెం జిల్లాలో 6, ఖమ్మం జిల్లాలో 4, వరంగల్‌ రూరల్, వరంగల్‌ అర్బన్‌ జిల్లాల్లో మూడు చొప్పున, సంగారెడ్డి, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో రెండు చొప్పున, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, గద్వాల, పెద్దపల్లి, సూర్యాపేట్, నిజామాబాద్, మహబుబాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఒక్కో పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 4,069 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 3,178 మందికి నెగిటివ్‌ వచ్చింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 67,318 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 15.51శాతం మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

జీహెచ్‌ఎంసీ పరిధిలోని కోవిడ్-19 రోగుల్లో 2,192 మందిని హోం ఐసొలేషన్‌లోనే ఉంచి చికిత్స అందిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ చెప్పారు. అత్యవసర వైద్యసేవలు అవసరమైన వారికి ఆస్పత్రుల్లో ఇబ్బందులు కలగవద్దనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నామన్నారు. అయితే, మెరుగైన చికిత్స అవసరమైన వారిని హోం ఐసొలేషన్‌ నుంచి ఆస్పత్రులకు తరలిస్తున్నామని, ఈ మేరకు బుధవారం ఒక్కరోజే 13మందిని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రులకు తరించామని వెల్లడించారు.

హోంమంత్రి మహమూద్‌ అలీ వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. కొద్దిరోజుల క్రితం నిర్వహించిన పరీక్షల్లో హోంమంత్రి వద్ద భద్రతా విధులు నిర్వహిస్తున్న వారికి పరీక్షలు జరిపితే నలుగురికి పాజిటివ్‌ వచ్చింది. సాధారణంగా పరీక్షల్లో భాగంగా మంత్రి భద్రతా సిబ్బందికి మళ్లీ పరీక్షలు జరపగా బుధవారం మరో నలుగురికి పాజిటివ్‌ అని నిర్ధారించారు.