Hyderabad, May 15: తెలంగాణలో గడచిన 24 గంటల్లో 64,362 కరోనా పరీక్షలు నిర్వహించగా 4,298 మందికి పాజిటివ్ అని నిర్ధారణ (4,298 new COVID-19 cases) అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 601 కేసులు గుర్తించారు. మేడ్చల్ లో 328, రంగారెడ్డి జిల్లాలో 267 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 6,026 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, 32 మంది (32 deaths in 24 hours) మరణించారు.
రాష్ట్రంలో ఇప్పటిదాకా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 5,25,007కి పెరిగింది. 4,69,007 మంది కరోనా నుంచి బయటపడ్డారు. 53,072 యాక్టివ్ కేసులు రాష్ట్రంలో ఉన్నాయి. మొత్తం మరణాల సంఖ్య 2,928కి చేరింది. ఇక, తెలంగాణలో కరోనా రోగుల రికవరీ రేటు 89.33 శాతంగా నమోదైంది. జాతీయస్థాయిలో రికవరీ రేటు 83.8 శాతం కాగా, తెలంగాణలో ఆ రేటు ఆశాజనకంగా ఉంది.
కరోనా తీవ్రత (Telangana Coronavirus) దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ నాలుగవ రోజుకు చేరుకుంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్‌డౌన్ మినహాయింపులో భాగంగా ఈరోజు కూడా రోడ్లపైకి భారీగా జనం వచ్చి చేరారు. దీంతో పలు కూడళ్ళలో ట్రాఫిక్ జామ్ ఏర్పండి. అటు సూపర్ మార్కెట్‌లు, రైతు బజార్‌లు కిటకిటలాడుతున్నాయి. సూపర్ మార్కెట్‌ల దగ్గర భారీగా క్యూ లైన్లు ఏర్పడ్డాయి. మలక్ పేట, బేగంబజార్, బడిచౌడి ప్రాంతాల్లో ఎలాంటి కరోనా జాగ్రత్తలు కనిపించని పరిస్థితి నెలకొంది.
కరోనా బాధితులకు ఆహారాన్ని అందించే మహత్తర కార్యక్రమాన్ని తెలంగాణ పోలీస్‌శాఖ శనివారం ప్రారంభించింది. ప్రస్తుత లాక్‌డౌన్‌లో అనేక మందికి ఆహరం కూడా లభ్యం కానీ పరిస్థితుల్లో పోలీస్‌శాఖ మహిళా భద్రతా విభాగం అన్నార్తులకు ఉచితంగా ఆహారాన్ని అందించేందుకు నడుం బిగించింది. నగరంలోని పలు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ప్రతీరోజు కనీసం 2 వేల మదికి ఉచిత భోజనం అందించే కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించింది. దీనిలో భాగంగా సికిందరాబాద్ బోయినపల్లి సమీపంలోని శోభా గార్డెన్‌లో సేవా ఆహార్ పేరుతో ఏర్పాటు చేసిన సెంట్రల్ కిచెన్‌ను ఈ ఉదయం మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతీ లక్రా, డీఐజీ బి. సుమతి పరిశీలించారు.