Cyberabad cp Stephen ravindra (Photo-Twitter)

Hyd, Dec 2: దేశంలోనే అతిపెద్ద సైబర్‌ మోసం భాగ్యనగరంలో వెలుగు చూసింది. ఎస్‌బీఐ ధనీ బజార్‌, ద లోన్ ఇండియా, లోన్‌ బజార్ పేర్లతో నకిలీ కాల్‌సెంటర్లు ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా రూ.వందల కోట్ల మోసాలకు పాల్పడుతున్న ముఠాలను సైబరాబాద్‌ పోలీసులు (Cyberabad police) అరెస్టు చేశారు. ఈ వివరాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర (Cyberabad CP Stephen Ravindra) మీడియా సమావేశంలో తెలిపారు. స్టీఫెన్‌ రవీంద్ర మీడియా సమావేశంలో మాట్లాడుతూ..స్ఫూపింగ్‌ యాప్‌ ద్వారా ఎస్‌బీఐ అసలైన కస్టమర్‌ కేర్‌ నుంచే ఫోన్‌ చేస్తున్నట్లు నమ్మించి మోసాలకు పాల్పడుతున్నట్లు తేల్చారు.

వీరిలో ఓ ముఠా ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్‌లో ఎస్‌బీఐ నకిలీ కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. ఈ కాల్‌సెంటర్‌ నుంచి దేశవ్యాప్తంగా ఏడాదిలోనే 33 వేల కాల్స్ చేసి రూ.కోట్లు కాజేసినట్లు గుర్తించారు. ఈ ముఠాపై దేశవ్యాప్తంగా 209 కేసులు నమోదైనట్లు స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. ఎస్‌బీఐ ఏజెంట్ల నుంచి ఖాతాదారుల వివరాల తీసుకొని క్రెడిట్‌కార్డు దారుల నుంచి ముఠా (online money-lending racket) డబ్బులు కాజేస్తున్నట్లు చెప్పారు. దీని కోసం వారు స్ఫూఫింగ్‌ యాప్‌ వాడుతున్నారని.. ఈ యాప్‌ వాడకంలో ఫర్మాన్‌ హుస్సేన్‌ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించాడని సీపీ తెలిపారు.

ప్రమాణస్వీకారం చేసిన తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు, రాజ్యసభ సమావేశాల దృష్ట్యా బండా ప్రకాశ్‌ ప్రమాణ స్వీకారానికి గైర్హాజరు

1860 180 1290 అనే నంబరును స్ఫూపింగ్ చేస్తున్నట్లు వివరించారు. 14 మంది నిందితులను అరెస్టు చేసి 30సెల్‌ఫోన్లు, 3ల్యాప్‌టాప్‌లు, కారు, బైకు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ధనీ, లోన్‌ బజార్‌ పేరుతో రుణాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న మరో ముఠాను కూడా సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు అభిషేక్ మిశ్రా నకిలీ యాప్‌ తయారు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు.

నకిలీ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయ్యాక వ్యక్తిగత వివరాలు తీసుకొని ఆ తర్వాత రుణం మంజూరైనట్లు చెబుతారని.. ప్రొసెసింగ్‌ ఫీజు పేరిట అధిక మొత్తంలో నగదు తీసుకుంటున్నారని వివరించారు. ఈ ముఠాలో 14 మందిని అరెస్టు చేసి వారి నుంచి 17 చరవాణులు, 3ల్యాప్‌టాప్‌లు, 5సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు.