Hyderabad, July 10: భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే నాలుగురోజులుగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో సీఎం కేసీఆర్ (CM KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని విద్యా సంస్థలకు సోమవారం నుంచి మూడు రోజులపాటుసెలవులు (Holidays)ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన సహాయక చర్యలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో (KCR Review) సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్ (CS)సహా ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. గత రెండు రోజుల్లో హైదరాబాద్ వ్యాప్తంగా సగటున 8 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో సోమ, మంగళ, బుధ వారాలు మూడు రోజులపాటు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు సీఎం శ్రీ కేసీఆర్ ప్రకటించారు.
— Telangana CMO (@TelanganaCMO) July 10, 2022
ఇవాళ కూడా చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. మరో రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జీహెచ్ఎంసీ పరిధిలోని మాన్‌సూన్ బృందాలను అధికారులు అప్రమత్తం చేశారు.
రాష్ట్రంలో మూడు రోజులుగా వర్షాలు కరుస్తున్నాయని.. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (talasani srinivas yadav) సూచించారు. ఈ మేరకు హైదరాబాద్ నగర ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని చెప్పారు. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చూడాలని పేర్కొన్నారు.
జీహెచ్ఎంసీ (GHMC) అధికారుల సహాయం కొరకు 040-21111111 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలన్నారు. కార్పొరేటర్లు తమ తమ డివిజన్లలో పర్యటిస్తూ పరిస్థితులను పరిశీలించాలని.. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని తలసాని ఆదేశించారు.