CM KCR Press Meet Highlights (Photo-Twitter.CMO Telangana)

Hyd, July 10: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న (Telangana Rains) నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు (CM KCR) ఆదేశించారు. ఎవరికీ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. తాను కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తానని, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తానని తెలిపారు.ఇక వాతావరణశాఖ తెలంగాణలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన నేపథ్యంలో.. శనివారం సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు పలు సూచనలు చేశారు. వరదలతో ఎలాంటి నష్టం జరగకుండా తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలన్నారు.

వరద, ముంపు ఉండే ప్రాంతాలను గుర్తించి, అధికారులను, ఎన్డీఆర్‌ఎఫ్, రెస్క్యూ టీంలను సిద్ధం చేయాలని.. ఏర్పాట్లపై అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని సీఎస్‌ను ఆదేశించారు. జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల నాయకులు, ప్రజాప్రతినిధులు స్థానికంగా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ నెల 11న ప్రగతిభవన్‌లో తలపెట్టిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ల సమావేశంతోపాటు 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టదలచిన ‘రెవెన్యూ సదస్సు’లను భారీ వర్షాల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్టు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత కొత్త తేదీలను ప్రకటిస్తామన్నారు.

షాకింగ్ వీడియో.. వరదల్లో చిక్కుకుని 30 మంది విద్యార్థుల ఆర్తనాదాలు, అండర్‌ బ్రిడ్జి వద్ద వరద నీటిలో చిక్కుకున్న స్కూలు బస్సు, డ్రైవర్‌ అప్రమత్తమవడంతో తప్పిన పెను ప్రమాదం

భారీ వానలు, వరదల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దని సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. అంతా తగిన స్వీయ జాగ్రత్తలు పాటించాలని కోరారు. నదులు, వాగులు ఉప్పొంగుతుండటం, రిజర్వాయర్లు నిండుతుండటంతో.. నీటి పారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహారాష్ట్రతోపాటు రాష్ట్రవ్యాప్తంగా రెడ్‌అలర్ట్‌ ఉన్నందున పరిస్థితులను ఎప్పటికప్పుడూ సమీక్షిస్తున్నానని, అవసరమైతే వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహిస్తానని తెలిపారు. జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రజల రక్షణ నిమిత్తం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.