![](https://test1.latestly.com/wp-content/uploads/2023/11/BJP.jpg)
Assembly Election 2023 Results Live News Updates: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో దూసుకెళ్తోంది. తొలి రౌండ్ నుంచి కాంగ్రెస్ తన సత్తా చాటుతోంది. తెలంగాణలో చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇప్పటివరకు 65 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఖమ్మం ఆశ్వారావుపేటలో, భద్రాద్రి కొత్తగూడెం ఇల్లెందులో కాంగ్రెస్ విజయం సాధించింది.
తెలంగాణలో (Assembly Election 2023 Results) తొలిసారి పోటీచేసిన పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన (Janasena) ఘోర పరాభవం చవిచూసింది. పోటీచేసిన అన్నిస్థానాల్లోనూ గ్లాస్ పార్టీ డిపాజిట్లు కోల్పోయింది. కూకట్‌పల్లి, తాండూరు, కొత్తగూడెంలో జనసేనాని పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రచారం చేశారు. అయినప్పటికీ ఆ పార్టీ కనీసం పోటీలో కూడా నిల్వలేకపోయింది.
బీజేపీతో (BJP) పొత్తుపెట్టుకున్న జనసేన.. ఎనిమిది స్థానాల్లో పోటీచేసింది. ఈ అన్ని స్థానాల్లో పార్టీ అభ్యర్థులు కనీసం డిపాజిట్లు దక్కించుకోలేకపోయారు. ముఖ్యంగా కూకట్‌పల్లి నియోజకవర్గంలో తమ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్ గెలుస్తారని జనసైనికులు నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఆ నియోజకవర్గంలో 5 రౌండ్లు ముగిసే సరికి జనసేన అభ్యర్థి వెనుకబడి మూడో స్థానంలో కొనసాగుతున్నారు.
ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వారావుపేట, కూకట్‌పల్లి, తాండూరు, కోదాడ, నాగర్‌కర్నూలు నియోజకవర్గాల్లో జనసేన పోటీచేసింది. ఇక బీజేపీ 88 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. ప్రధాని మోదీ, అమిత్ షా సహా ఆ పార్టీ అతిరథ మహారథులు ప్రచారం చేసినప్పటికీ ఆ పార్టీ అపజయం మూటగట్టుకున్నది. బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్ కూడా ఓటమి బాటలో పయణిస్తున్నారు. ప్రస్తుతానికి బీజేపీ 8 సీట్లలో ఆధిక్యంలో ఉన్నట్లుగా ఎన్నికల ఫలితాలను బట్టి తెలుస్తోంది.