Assembly Election 2023 Results Live News Updates: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో దూసుకెళ్తోంది. తొలి రౌండ్ నుంచి కాంగ్రెస్ తన సత్తా చాటుతోంది. తెలంగాణలో చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇప్పటివరకు 65 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఖమ్మం ఆశ్వారావుపేటలో, భద్రాద్రి కొత్తగూడెం ఇల్లెందులో కాంగ్రెస్ విజయం సాధించింది. బీజేపీ 8 చోట్ల ఆధిక్యం కనబరుస్తోంటే.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగిన జనసేన జాడ అస్సలు కనిపించకుండా పోయింది.
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగింది. బీజేపీతో పొత్తుతో మొత్తం 8 స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేసింది. కౌంటింగ్ ప్రారంభమై పలు రౌండ్లు ముగిసినా ఆ పార్టీ అభ్యర్థులు ఒక్క చోట కూడా ప్రభావం చూపించలేకపోతున్నారు. పవన్ కల్యాణ్ స్వయంగా ప్రచారం చేసి తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
అయినా ఓటర్లు పెద్దగా పట్టించుకున్నట్లు లేరు. ముఖ్యంగా కూకట్‌పల్లి నియోజకవర్గంలో తమ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్ గెలుస్తారని జనసైనికులు నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఆ నియోజకవర్గంలో 5 రౌండ్లు ముగిసే సరికి జనసేన అభ్యర్థి వెనుకబడి మూడో స్థానంలో కొనసాగుతున్నారు.