Hyd, Jan 20: తెలంగాణ రాష్ట్రంలో ఒమైక్రాన్ కరోనా వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. ఫలితంగా భారీగా కరోనా కేసులు (COVID in Telangana) నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 4,207 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 1,645 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ 380, రంగారెడ్డిలో 336 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం నమోదయ్యే కేసుల్లో 95 శాతానికిపైగా ఒమైక్రాన్ వేరియంట్‌వే ఉంటున్నాయి. గొంతులో గరగర, బాడీ పెయిన్స్, తలనొప్పి, ముక్కుకారడం, పొడి దగ్గురావడం, జ్వరం లాంటివి ప్రస్తుత వేవ్‌లో కరోనా లక్షణాలుగా కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.
కొందరిలో మాత్రం 4-5 రోజుల పాటు ఒళ్లు నొప్పులు ఉంటున్నాయని అంటున్నారు. జ్వరం కూడా ఒకటి రెండు రోజుల తర్వాత తగ్గిపోతోందని, వైరల్ లోడ్ అంతా గొంతులోనే ఉండటంతో ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడం లేదని వివరిస్తున్నారు. అందుకే ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఆస్పత్రుల్లో అడ్మిషన్లు తక్కువగా ఉంటున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలను (Telangana extends Covid curbs ) పొడిగించింది. ఇప్పటికే సభలు, సమావేశాలు, ర్యాలీలు, రాజకీయ సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం విధించింది. ఇవాళ్టితో ఆంక్షల గడువు ముగుస్తున్న తరుణంలో ఈ నెలాఖరు వరకు పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ మహమ్మారి కట్టడిలో భాగంగా నిబంధనలను కఠినతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలని ప్రభుత్వం సూచించింది. రేపటి నుంచి ఫీవర్ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రేపటి నుంచి ప్రారంభమయ్యే పర్వేకు మెడికల్ కిట్లను ఆయా పీహెచ్ సీలకు తరలించినట్లు మంత్రి హరీశ్ రావు మీడియా సమావేశంలో వెల్లడించారు.