Rythu Bandhu Funds: రైతు బంధు నిధులను నిలిపివేయవద్దు, సొమ్ముని రైతుల ఖాతాల్లోకి జమచేయాలని బ్యాంకర్లకు మంత్రి హరీష్ రావు ఆదేశం, రైతు సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ల ఏర్పాటు
Telangana Finance Minister T. Harish Rao | Photo: FB

Hyderabad, June 23: వానాకాలం పంట పెట్టుబడి కోసం తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన రైతుబంధు సొమ్మును రైతులు విత్ డ్రా చేసుకోలేకుండా కొన్ని బ్యాంకులు షరతులు విధించాయి. రైతుల ఖాతాల్లో జమకాబడిన రైతు బంధు నిధులను పాత బకాయిల కింద బ్యాంకులు సర్దుబాటు చేసుకుంటున్నాయి. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు, సీఎస్ సోమేశ్ కుమార్ లు బ్యాంకర్లతో మంగళవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో అత్యవసర సమావేశం నిర్వహించారు.

రైతుబంధు నిధులను నిలిపివేయడానికి ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని ఈ సందర్భంగా బ్యాంకర్లు తెలిపారు. భవిష్యత్తులో రైతుబంధుకు సంబంధించి ఎలాంటి మొత్తాన్ని నిలిపివేయవద్దని ఆర్ధిక మంత్రి హరీష్‌ రావు బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు నిలిపివేయబడిన లేదా పాత బాకీల కింద సర్దుబాటు చేయబడిన రైతుబంధు నిధులు ఉన్నట్లయితే తిరిగి వెంటనే ఆ మొత్తాన్ని రైతుల ఖాతాకు జమ చేయాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ అంశంపై బ్యాంకర్లు తమ తమ బ్యాంకు బ్రాంచీలకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేయాలన్నారు.

ఇక ఈ వ్యవహారాన్ని జిల్లా స్థాయిలో పర్యవేక్షించటానికి జిల్లా కలెక్టర్లకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర స్థాయిలో ఉన్నత స్థాయి టీం మానిటరింగ్ చేస్తుందని తెలిపారు. ఈ క్రమంలో రైతులు తమ సమస్యలను తెలియజేయటానికి రెండు టోల్ ఫ్రీ నెంబర్లు 18002001001 మరియు 04033671300 ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇవి ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయి. అదే విధంగా పంట రుణాల రెన్యూవల్, పంపిణీని బ్యాంకర్లు వేగవంతం చేయాలని ఈ సందర్భంగా మంత్రి బ్యాంకర్లను ఆదేశించారు.