Hyd, May 30: హైదరాబాద్ నగరంలో అద్దె ఇంటి పేరుతో ఓ యువతిని తన నివాసానికి తీసుకెళ్లి అత్యాచారయత్నం(girl molested in Hyderabad) చేశాడు ఓ కామాందుడు. ఈ ఘటన మే 19వ తేదీన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. హైదరాబాద్ శివారు ప్రాంతానికి చెందిన ఓ యువతి.. నగరంలో నివసించేందుకు అద్దె ఇండ్ల కోసం మే మొదటి వారంలో ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఆన్‌లైన్లో శోధించగా.. FlatnFlatmate పేరుతో ఒక అద్దె సైట్ కనిపించింది. దీంతో ఆ సైట్‌కు వెళ్లి తన వివరాలను నమోదు చేయగా, హమీద్ అనే వ్యక్తి యువతిని పరిచయం చేసుకున్నాడు. వాట్సాప్ కాల్ చేసి ఆమెతో మాట్లాడాడు.
మే 19వ తేదీన అద్దె ఇల్లు కోసం హమీద్‌కు ఫోన్ చేయగా, ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రి వద్దకు రమ్మన్నాడు. అక్కడికి వెళ్లి ఆమె ఫోన్ చేయగా.. ఓవైసీ ఆస్పత్రి వద్దకు రావాలని చెప్పాడు. ఆ ఏరియా తనకు తెలియదని చెప్పడంతో.. కర్మన్‌ఘాట్ వరకు రావాలని, అక్కడ పికప్ చేసుకుంటానని చెప్పాడు. ఇక యువతి కర్మన్‌ఘాట్ చేరుకోగానే, హమీద్ తన బైక్‌పై ఎక్కించుకుని అక్బర్ బాగ్‌లోని ఆనంద్ నగర్‌లోని తన ఇంటికి వెళ్లాడు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆనంద్ నగర్‌లోని తన ఇంటి రెండో అంతస్తులోకి యువతిని తీసుకెళ్లి.. క్షణాల్లోనే తలుపు మూసేశాడు హమీద్. ఆమె నుంచి ఫోన్ లాక్కొని, కౌగిలించుకోబోయాడు. యువతి ప్రతిఘటించడంతో.. తీవ్రంగా కొట్టాడు. బట్టలు విప్పాలని బలవంతం చేశాడు. కానీ యువతి అతనికి లొంగకపోవడంతో.. సాయంత్రం 4 గంటల సమయంలో నల్లగొండ క్రాస్ రోడ్స్ బస్టాప్‌లో వదిలేసి వెళ్లిపోయాడు.
నల్లగొండ క్రాస్ రోడ్స్ బస్టాప్ నుంచి బాధితురాలు తన ఇంటికి వచ్చేసింది. తనకు జరిగిన అవమానాన్ని ఆమె ఎవరితోనూ చెప్పుకోలేకపోయింది. తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైంది. పోలీసు స్టేషన్‌కు వెళ్తే పరువు పోతుందని భావించి.. ఇంట్లోనే ఉండిపోయింది. కానీ 24వ తేదీన తన స్నేహితురాలితో బాధితురాలు తనకు జరిగిన అవమానాన్ని షేర్ చేసుకుంది. దీంతో స్నేహితురాలు ధైర్యం చెప్పి.. పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించింది. ఇక అదే రోజు సాయంత్రం 4:30 గంటల సమయంలో చాదర్ ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.