Godavari water level rises (Photo/X/Video Grab)

Bhadrachalam, Sep 10: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకు ఎక్కువవుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం (Godavari Water Level Rise) పెరుగుతోంది. సోమవారం 26 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం.. ఈ రోజు మధ్యాహ్నానికి 47 అడుగులు దాటి ప్రవహిస్తోంది. సాయంత్రానికి 48 అడుగులకు (Godavari Water Level at Bhadrachalam)చేరుకుంటుందని భావిస్తున్న అధికారులు... అప్పుడు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు.

ఈరోజు ఉదయం ఏడున్నర గంటలకు గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ క్రమంలో వరద నీరు పెరుగుతుండటంతో సాయంత్రానికే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే పరిస్థితి కనిపిస్తోంది. నిన్న ఉదయం నుంచి గోదావరి నీటిమట్టం 20 అడుగులకు పైగా పెరిగింది.

ఏపీకి పొంచి ఉన్న మరో తుఫాను ముప్పు, ఈనెల 20–22 మధ్య బంగాళా­ఖాతంలో మరో అల్పపీడనం, ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన

ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద కారణంగా గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. గోదావరి నీటిమట్టం పెరగడంతో పాటు దిగువ ప్రాంతంలో ఉన్న శబరి ఉపనది పోటెత్తడంతో ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ముంపు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.శబరి, సీలేరు ఉద్ధృతంగా ప్రవహించడంతో చింతూరు మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. భద్రాచలం వద్ద వేగంగా పెరుగుతున్న గోదావరిలో 11 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు దిగువకు ప్రవహిస్తోంది.