Hyderabad, September 14: హుస్సేన్ సాగర్‌లో పిఒపి గణేష్ విగ్రహాల నిమజ్జనానికి వీల్లేదంటూ ఇచ్చిన తీర్పును సవరించడానికి రాష్ట్ర హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. మంగళవారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో, పిఒపి గణేష్ విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని నిర్ణయించారు. నిమజ్జనంపై చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కూడా సీఎం చర్చించారు. వేలాది విగ్రహాల నిమజ్జనం, ప్రజల మనోభావాలు వంటి ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, సుప్రీం కోర్టుకు వెళ్లాలనే అభిప్రాయం వ్యక్తం అయింది.
ఈ క్రమంలో హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనాలకు సంబంధించి సందిగ్ధత ఇంకా కొనసాగుతోంది. ఒకవేళ సుప్రీం కూడా నిరాకరిస్తే అప్పుడు పరిస్థితి ఏంటనే దానిపై ప్రభుత్వ వర్గాలు చర్చిస్తున్నట్లు సమాచారం.
అంతకుముందు గణేశ్ నిమజ్జనంపై జీహెచ్‌ఎంసీ వేసిన రివ్యూ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్ట్, నిమజ్జనంపై ఇచ్చిన తీర్పును సవరించేంది లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. హుస్సేన్‌సాగర్‌లో పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని గతవారం ఇచ్చిన తీర్పుకే హైకోర్టు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం గణేష్ నిమజ్జనాల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు తగిన సమయం లేదని, పరిస్థితులను అర్థం చేసుకొని తీర్పు సవరించాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోరారు. నిమజ్జనం తర్వాత 24 గంటల్లో వ్యర్థాలు తొలగిస్తామని పేర్కొన్నారు. దీనిపై ఏకిభవించని న్యాయస్థానం గతేడాది కూడా ప్రభుత్వం ఇలాగే చెప్పిందని, ఇప్పటికీ ప్రత్యామ్నాయం చూసుకోకపోవడాన్ని తప్పుబట్టింది. మీరు సృష్టించుకున్న సమస్యను మీరే పరిష్కరించుకోవాలని హైకోర్ట్ తేల్చిచెప్పింది. తమ తీర్పుపై అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చని హైకోర్ట్ ఖరాఖండీగా చెప్పింది.