TSPSC | File Photo

Hyderabad, May 19:  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు బుధవారం నియమించారు. ముఖ్యమంత్రి కార్యాలయం పంపిన ప్రతిపాదనలను గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. టీఎస్‌పీఎస్‌సీ నూతన చైర్మన్ గా డా. బి. జనార్ధన్ రెడ్డి (ఐఎఎస్) నియామకమయ్యారు. ప్రస్తుతం జనార్ధన్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శిగా ప్రస్తుతం పనిచేస్తున్నారు.

అలాగే సభ్యులుగా రమావత్ ధన్ సింగ్ (బిటెక్ సివిల్, రిటైర్డ్ ఈఎన్‌సి), ప్రొ. బి. లింగారెడ్డి (ఎమ్మెస్సీ పి.హెచ్.డి., ప్రొ. హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ సిబిఐటి), కోట్ల అరుణ కుమారి (బిఎస్సీ, బీఈడీ, ఎంఎ, ఎల్.ఎల్.బి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటి కలెక్టర్), సుమిత్రా ఆనంద్ తనోబా (ఎంఎ తెలుగు, తెలుగు పండిట్ ), కారం రవీందర్ రెడ్డి (బికాం, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి), ఆరవెల్లి చంద్రశేఖర్ రావు (బి.ఎ.ఎమ్.ఎస్ (ఉస్మానియా), ప్రాక్టీసింగ్ ఆయుర్వేదిక్ డాక్టర్), ఆర్. సత్యనారాయణ (బిఎ, జర్నలిస్ట్) లను సీఎం నియమించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు.

టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ పదవి గతేడాది డిసెంబర్ నుంచి ఖాళీగా ఉంది. అప్పట్నించి రాష్ట్రంలో కొత్త ఉద్యోగ నియామకాల ప్రక్రియ నిలిచిపోయింది. ఈ విషయమై హైకోర్టులో పిల్ దాఖలవడంతో నాలుగు వారాల్లో చైర్మన్ మరియు సభ్యుల నియామకం పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్ట్ ఇటీవల ఆదేశించింది.

మరోవైపు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ మరియు సభ్యులను సీఎం కేసీఆర్ ఈరోజు నియమించారు. దీంతో రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియకు ఇప్పుడు లైన్ క్లియర్ అయింది.