Hyd, Feb 28: తెలంగాణలో గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రేవంత్ రెడ్డి సర్కారు (Telangana Government) రద్దు చేసింది.5089 టీచర్ పోస్టుల భర్తీకి సెప్టెంబర్‌లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు (Telangana Government, Cancelled, Dsc Notification) చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మరిన్ని పోస్టులతో త్వరలోనే కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.ఒకట్రెండు రోజుల్లోనే దాదాపు 11వేలకు పైగా పోస్టులతో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ జారీ చేయనున్న వేళ 2023లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో మొత్తం 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి గతేడాది సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 21వరకు దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. నవంబరు 20 నుంచి 30 వరకు టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్(టీఆర్‌టీ) పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో నవంబర్ 30న ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో టీఆర్‌టీ పరీక్షలను వాయిదా వేశారు. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చెప్పినప్పటికీ.. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడటం, త్వరలోనే మరికొన్ని పోస్టులను కలిపి మెగా డీఎస్సీకి ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో పాత నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. అయితే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు.. మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని విద్యాశాఖ స్పష్టం చేసింది.
రాష్ట్రంలో ఉపాధ్యాయ నియా మకాలకు సంబంధించిన డీఎస్సీ నోటిఫికేషన్ మరో రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. మొత్తం 11,062 టీచర్ పోస్టులను విద్యాశాఖ ప్రతిపాదించగా దీనికి ఆర్థిక శాఖ అనుమతి కూడా లభించింది. వాస్తవానికి బుధవారమే నోటిఫికేషన్ ఇవ్వాలని భావించినా షెడ్యూల్ ఖరారు, సాఫ్ట్‌వేర్ రూపకల్పనకు తుది మెరుగులు దిద్దాల్సి ఉండటంతో ఒకరోజు ఆలస్యం కావొచ్చని అధికారులు తెలిపారు. గతేడాది పోస్టులకు కొత్త పోస్టుల జత చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.