Coronavirus Second Wave: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ భయం, తాజా మార్గదర్శకాలను విడుదల చేసిన వైద్య, ఆరోగ్య శాఖ
Coronavirus Outbreak. | (Photo Credits: Pixabay)

Hyderabad, Nov 4: తెలంగాణ రాష్ట్రంలో కరోనా ‘సెకండ్‌ వేవ్‌’ భయం మొదలైంది. అమెరికా, యూరప్‌ దేశాల్లో వైరస్‌ ఇప్పటికే సెకండ్‌ వేవ్‌ సృష్టిస్తున్న ప్రకంపనలతో టీఎస్ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. మొదటి దశలో కరోనాను నియంత్రించినట్లుగానే..సెకండ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవ్వాలని ఇప్పటికే వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ అధి కారులకు దిశానిర్దేశం చేయగా, వాటిని అమలు చేసేందుకు యంత్రాంగం సన్నాహాలు ప్రారంభిం చింది. ప్రజల్లో, వైద్యాధికారుల్లో కరోనా కట్టడిలో నెలకొన్న నిర్లక్ష్యాన్ని పారదోలేందుకు ఉన్నతాధి కారులు నడుం బిగించారు.

తెలంగాణలో మార్చి 2 నుంచి మొదలైన కరోనా వ్యాప్తి, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే కరోనా పూర్తి నియంత్రణకు వచ్చే వరకు జాగ్రత్తలు తప్పదని చెబుతూనే వైద్యులు ఉన్నారు. కానీ ఏమీ కాదన్న ధోరణి జనంలో ఏర్పడటంతో వైద్య, ఆరోగ్య శాఖలో ఆందోళన మొదలైంది. దీనికి తోడు ఇప్పుడు చలికాలం మొదలైంది.. ఈ కాలంలో సీజనల్‌ ఫ్లూ వ్యాధులు, దానికి తోడు కరోనా విజృంభించే ప్రమాదం పొంచి ఉందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు.

తెలంగాణలో మళ్ళీ పెరుగుతున్న కొవిడ్ కేసులు, కొత్తగా మరో 1637 మందికి పాజిటివ్, రాష్ట్రంలో 18 వేలకు పెరిగిన ఆక్టివ్ కేసులు

అందుకే అధికార యంత్రాంగం జిల్లాలపై ఫోకస్‌ పెట్టింది. పరిస్థితిని అంచనా వేసి యంత్రాంగాన్ని, ప్రజలను అప్రమత్తం చేయాలని నిర్ణయించింది. మరోవైపు డెంగీ, మలేరియా వంటి వంటి సీజనల్‌ వ్యాధులతోనూ కరోనా వచ్చే ప్రమాదం ఉందని, అటువంటి కేసులను గుర్తించాలన్నారు. ఇక కరోనాపై తాజాగా రూపొందించిన మార్గదర్శకాలను అందరూ పాటించాల్సిందేనని వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

కరోనా సెకండ్ వేవ్ తాజా మార్గదర్శకాలు

–సెకండ్‌ వేవ్‌ ప్రమాదం ఉన్నందున అవసరమైతేనే ఎవరైనా ఇంటి నుంచి బయటకు రావాలి. చిన్న పిల్లలు, వృద్ధులు బయటకు రాకపోవడమే శ్రేయస్కరం.

–పండుగలు, శుభకార్యాలు ఏవైనా అందరూ ఒకేచోట చేరడం మంచిది కాదు. ఎవరికి వారే కుటుంబంలో జరుపుకోవాలి..

–చలికాలంలో డెంగీ, మలేరియా సహా ఫ్లూ జ్వరాలతో కలిపి కరోనా వచ్చే అవకాశముంది. కాబట్టి ఏమాత్రం లక్షణాలున్నా అశ్రద్ధ చేయొద్దు.

–కరోనా లక్షణాలుంటే వెంటనే నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి. సాధారణ లక్షణాలుంటే వైద్యుల సూచన మేరకు మందులు వాడుతూ ఇంట్లో ఐసోలేషన్‌లో ఉండాలి. అటువంటివారు ఇంట్లో కనీసం 2 మీటర్ల దూరాన్ని పాటించాలి.

–ఐసోలేషన్‌లో ఉండే గదికి గాలి వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి.

–ఎప్పటికప్పుడు జ్వరాన్ని చెక్‌ చేసుకోవాలి. శ్వాస సంబంధ సమస్యలు వస్తే తక్షణమే ఆసుపత్రికి వెళ్లాలి.

–ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి. తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి.

–ఆసుపత్రి నుంచి కోలుకొని ఇంటికి వెళ్లేవారు ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణించకూడదు.

–కూరగాయలు, పండ్లను బేకింగ్‌ పౌడర్‌ కలిపిన నీటితో కడగాలి. ఇంట్లో తయారుచేసిన సమతుల్య ఆహారం తీసుకోవాలి.

–రోజుకు తప్పనిసరిగా 3 నుంచి 4 లీటర్ల నీటిని తాగాలి. పసుపు వేసిన వేడి పాలను తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

–కొబ్బరినీళ్లు, నిమ్మరసం వంటి ద్రవపదార్థాలు తీసుకోవాలి.

–ఇంట్లో ఖాళీగా ఎవరూ కూర్చోకూడదు.. అంటే ప్రాణాయామం, ధ్యానం చేస్తుండాలి.. సంగీతం వినడం, టీవీ చూడటం, పుస్తకాలు చదవడమూ చేయాలి.

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మళ్లీ టెస్టుల సంఖ్యను పెంచాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రధానంగా రద్దీ ప్రాంతాల్లో మొబైల్‌ టెస్టింగ్‌ వాహనాలతో పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా సంతలు, రైతుబజార్లు, బస్టాండ్లు, గ్రామీణ ప్రాంతాల్లోని పని ప్రదేశాల వద్దకే వెళ్లి టెస్టులు చేయాలని నిర్ణయించారు.