Hyd, Dec 19: తెలంగాణలో డిసెంబర్ 28 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. దీంతో పాటు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులూ, తప్పులు సరిచేయడం తదితర అంశాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 28 నుంచి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తామని, కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు, హౌసింగ్‌పై గ్రామ సభలో నిర్ణయం మేరకు లబ్ధిదారులను ఎంపిక చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
రేషన్ దుకాణాల్లో పంపిణీ చేసే బియ్యం పక్కదారి పట్టకుండా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చారు. కాగా గత ప్రభుత్వంలో సుమారు ఆరేళ్లుగా కొత్త రేషన్ కార్డుల జారీ లేదు. ఉన్న కార్డుల్లో పేర్ల నమోదుకు కూడా అవకాశం ఇవ్వలేదు. రేషన్ కోసమే కాకుండా, ఆరోగ్యశ్రీ తదితర సేవలకూ రేషన్ కార్డులు తప్పనిసరి అయ్యాయి. కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో లక్షలాది మంది పేదలు ఆయా సేవలు అందుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.
కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాలకు 28 నుంచి దరఖాస్తులు.. గ్రామసభల ద్వారానే లబ్ధిదారుల ఎంపిక
హైదరాబాద్‌లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్‌లో సోమవారం (డిసెంబర్ 18) కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) భేటీ జరిగింది. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ గురించి మంత్రులు, కాంగ్రెస్ నేతలకు మంత్రి ఉత్తమ్ కీలక వివరాలు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 నుంచి దరఖాస్తులు స్వీకరించి, గ్రామ సభలో లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తెలిపారు.