
Hyd, Dec 24: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ ధరల మీదనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం (Telangana govt) సినిమా టికెట్ రేట్లను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. నిర్మాతల విన్నపం మేరకు రేట్ల పెంపుపై అధికారులు ప్రతిపాదనలు పంపారు. వాటిని పరిశీలించిన తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లను (Movie ticket rates) పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. టికెట్ ధరలపై జీఎస్టీ, ధర, నిర్వహణ ఛార్జీలు, ఆన్ లైన్ ఛార్జీలు వేర్వేరుగా ముద్రించాలని ప్రభుత్వం సూచించింది.
మల్టీప్లెక్స్ లలో కనీస ధర రూ. 100, గరిష్ఠ ధర రూ. 250కి పెంచింది. మల్టీప్లెక్స్ రిక్లైనర్ సీట్ల ధరను గరిష్ఠంగా రూ. 300కు పెంచుకోవడానికి అనుమతించింది. ఇక ఏసీ థియేటర్లలో కనీస ధర రూ. 50, గరిష్ఠ ధర రూ. 150గా నిర్ణయించింది. టికెట్ ధరలకు జీఎస్టీ, నిర్వహణ ఛార్జీలు అదనం. నిర్వహణ ఛార్జీల కింద ఏసీ థియేటర్లు రూ. 5, నాన్ ఏసీ థియేటర్లు రూ. 3 వసూలు చేసుకోవచ్చు.
ఆన్ లైన్ టికెటింగ్ సంస్థలు కన్వీనియన్స్ రుసుం, జీఎస్టీ వసూలు చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిర్వహణ ఛార్జీల కింద ఏసీ థియేటర్ లో రూ. 5, నాన్ ఏసీకీ రూ. 3 వసూలు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది.