Paddy Crops Procurement: మీకు ప్రేమ లేఖలు రాయడానికి రాలేదు, బిచ్చగాళ్లలా మమ్మల్ని చూస్తారా.. కేంద్రంపై మండిపడిన తెలంగాణ మంత్రులు
Telangana Minister Niranjan Reddy (Photo-Video Grab)

Hyd, Dec 24: వానాపంట కాల విషయంలో పంట కొనుగోలుపై లిఖితపూర్వక హమీ విషయంలో రెండు రోజులైనా కేంద్రం నుంచి స్పదన లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి (Telangana Minister Niranjan Reddy) మండిపడ్డారు. తెలంగాణ రైతుల సమస్యల పరిష్కారం కోసమే తాము ఢిల్లీకి వచ్చామని, కానీ కేంద్రం తాము ఏదో ప్రేమ లేఖలు రాయడానికి వచ్చినట్టుగా భావిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి రైతులపై (Farmers) ఎలాంటి చిత్తశుద్ధి లేకపోవడం బాధాకరమన్నారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఎంపీలు కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు, కేఆర్‌ సురేష్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, వెంకటేశ్‌ నేత, మన్నె శ్రీనివాసరెడ్డి, లింగయ్య యాదవ్‌లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

కేంద్రం ఒక రాజకీయ పార్టీలా వ్యవహరిస్తోందని. కేంద్ర మంత్రులు రాజకీయ నేతల్లా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు దక్కాల్సిన నిధులు గురించి అడుగుతుంతే మమ్మల్ని బిచ్చగాళ్లలా చూస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం సేకరణపై (Paddy Crops Procurement) రెండురోజుల్లో చెబుతామని పీయూష్‌ గోయల్‌ అన్నందుకే గురువారం సాయంత్రం ప్రభుత్వ పనిగంటలు ముగిసేవరకు తాము ఎదురుచూశామని తెలిపారు. అయినా ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని చెప్పారు. ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతున్నప్పుడు రాష్ట్ర బీజేపీ నేతలు బాధ్యత లేకుండా, ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్చల మధ్యలో మాట్లాడడానికి బీజేపీ నేతలు ఎవరని ప్రశ్నించారు.

తెలంగాణలో కఠిన ఆంక్షలు, పండుగలు, సెలెబ్రేషన్స్ పై ఆంక్షలు విధించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు, రాష్ట్రంలో 38కి చేరిన ఒమిక్రాన్ బాధితుల సంఖ్య

తెలంగాణ రైతుల కోసం గత 6 రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం పడిగాపులు కాస్తున్నామని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. అయితే తాము ఢిల్లీకి ఏదో పనిలేక వచ్చినట్లు చులకనగా, అవమానకరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతుల కోసం వస్తే చులకనగా ఉందా అని ఆయన ప్రశ్నించారు. వ్యవసాయ ఉత్పత్తులను క్రమబద్ధీకరించాల్సిన కేంద్రం సరిగ్గా పని చేయని కారణంగానే తెలంగాణ రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ధాన్యం సేకరణ అంశంలో కేంద్రమంత్రి పార్లమెంటులో చేసిన ప్రకటనను లిఖితపూర్వకంగా ఇవ్వాలని తాము అడుగుతున్నామని తెలిపారు. యాసంగిలో బాయిల్డ్‌ రైస్‌ వద్దని కేంద్రం చెప్పిన విషయాన్ని తాము రైతులకు చెప్పామన్నారు. ఇప్పుడు తాము అడిగేది ఖరీఫ్‌ దిగుబడి అదనపు కొనుగోళ్ల గురించేనని మంత్రి స్పష్టం చేశారు.

దేశంలోని సగం రాష్ట్రాల కంటే అత్యధికంగా తెలంగాణలో సాగు జరుగుతుందని, యాసంగిలో ఎక్కువ వరి పండేది తెలంగాణలోనే అని మంత్రి తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వం చేసిన తప్పా..?, రైతులు పంట పండించడం అన్యాయమా? అని ప్రశ్నించారు. దేశంలోని రైతాంగాన్ని వ్యవసాయం చేయొద్దు అనే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. వ్యవసాయ రంగ విషయంలో కేంద్రానికి ఒక విధానం లేని కారణంగానే సమస్య వచ్చిందన్నారు. ఏడేళ్లు గడిచినా మోదీ ప్రభుత్వం స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులు అమలు చేయలేదని, ఎమ్మెస్పీకి చట్టబద్ధత కల్పించలేదని విమర్శించారు.