Hyderabad, October 15: రైతులకు పెట్టుబడి సాయం కోసం 'రైతుబంధు' పథకం (Rythu Bandhu Scheme) కింద అందించే నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. గత జూన్ నుంచి సెప్టెంబర్ ఖరీఫ్ సీజన్ కు రూ. 1000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, తొలిదశలో రూ. 500 కోట్లను సోమవారం రోజున రైతుల ఖాతాల్లో జమ చేసింది. మిగతా రూ. 500 కోట్లను త్వరలోనే జమ చేయనుంది. ఇక ఖరీఫ్ లో లబ్ది పొందిన రైతులకే రబీలో పెట్టుబడి సాయం అందుతుంది. చెక్కుల మాదిరి కాకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకే ఈ నిధులు జమకానున్నాయి.
కాగా, ప్రస్తుతం రబీ (యాసంగి) సీజన్ లో రైతుబంధు పథకం నిబంధనల్లో మార్పులు చేయాలని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రధానంగా 5 లేదా 10 ఎకరాలు ఉన్న రైతులకు మాత్రమే ఇవ్వాలని ప్రతిపాదించింది, అయితే ప్రభుత్వం దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయ తీసుకోలేదు.
తెలంగాణ రాష్ట్ర నూతన పంచాయతీ రాజ్ చట్టం మేరకు ఇటీవల ప్రభుత్వం మూడు సభ్యులతో కూడిన ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేసింది. మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు బండారు భాస్కర్, వరంగల్ రూరల్ జిల్లాలోని నెక్కొండ మాజీ మండలాధ్యక్షుడు గటిక అజయ్ కుమార్ మరియు సీనియర్ న్యాయవాది పి. గోవర్ధన్ రెడ్డిని సభ్యులుగా నియమించారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
11వ రోజుకు ఆర్టీసీ సమ్మె, చర్చలకు సిద్ధం
ఇక తెలంగాణలో ఆర్టీసీ సమ్మె (TSRTC Strike) మంగళవారం 11వ రోజుకు చేరుకుంది. ఈరోజు సమ్మెలో భాగంగా రాస్తారోకోలు, మానవహారం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సోమవారం ఆర్టీసీ డిపోల ఎదుట బైఠాయింపు కార్యక్రమం చేపట్టడంతో పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. పరిస్థితి చేయిదాటిపోకుండా ఉండేందుకు అదనపు బలగాలను మోహరించారు, డిపోల ఎదుట ఫైరింజలను కూడా సిద్ధంగా ఉంచారు. ఆర్టీసీ సమ్మె పట్ల ప్రజల మద్ధతు ప్రభుత్వానికా లేక ఆర్టీసీ కార్మికులకా? ఒక విశ్లేషణ.
ఇక మరోవైపు టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడు, పార్టీ సెక్రటరీ జనరల్ కే. కేశవరావు ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం కావాలని ఆర్టీసీ యూనియన్లకు పిలుపునిచ్చారు. సీఎం ఆదేశిస్తే తాను ఆర్టీసీ నాయకులతో మాట్లాడతానని కేశవరావు పేర్కొన్నారు. కేశవరావు ప్రకటనకు టీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి సానుకూలంగా స్పందించారు. కేశవరావు మధ్యవర్తిత్వం వహిస్తే తాము చర్చలకు సిద్ధమే అని స్పష్టంచేశారు. అలాగే నేడు హైకోర్టులో మరోసారి టీఎస్ ఆర్టీసీ సమ్మె చర్చకు రాబోతుంది.
వాట్సాప్ లో వైరల్ అవుతున్న ఫేక్ వార్తపై సీఎంవో సీరియస్: తెలంగాణ సీఎం కార్యాలయం హెల్ప్ లైనుకు ఎవరో ఫోన్ చేసినట్లు, తమ అభిప్రాయాలు చెప్పినట్లు, సీఎం కార్యాలయ సిబ్బంది మాట్లడినట్లు రెండు రోజులుగా కొన్ని పత్రికల్లో, ఛానళ్లలో వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో, వాట్సాప్ లో కూడా ఒక వాయిస్ కాల్ వైరల్ అయింది. దీనిని సీఎం కార్యాలయం ఖండించింది. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయం పోలీస్ కమీషనర్ కు ఫిర్యాదు చేసింది.