Hyd, Jan 10: తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ప్రజల వద్దకు పాలనే లక్ష్యంగా ఆరు గ్యారంటీల (six guarantees) ఆమలుకు శ్రీకారం చుట్టిన సంగతి విదితమే. ప్రజాపాలన పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందించి ప్రజాపాలన వివరాలు అందుబాటులోకి తీసుకురానుంది. ఈమేరకు prajapalana.telanga na.gov.in వెబ్‌సైట్ రూపొందించింది.
ఎనిమిది రోజుల పాటు సాగిన ప్రజాపాలనలో మహాలక్ష్మి, రూ.500కే వంట గ్యాస్, కొత్త రేషన్ కార్డుల కోసం ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. లబ్ధిదారుల ఎంపికలో క్షేత్రస్థాయి పరిశీలన కీలకం కావడంతో ప్రభుత్వం తాజాగా కసరత్తు చేస్తోంది.ఈ నేపథ్యంలో పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మీ స్టేటస్ తెలుసుకునేందుకు మీ ఫోన్లకు ఓటీపీలు వస్తే చెప్పవద్దు. డబ్బులు పోగొట్టుకోవద్దు’ అని సూచిస్తున్నారు. ఈమేరకు వారు విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అజాగ్రత్తగా ఉండకూడదని, సైబర్ నేరగాళ్లతో చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఆరు గ్యారెంటీల దరఖాస్తు స్టేటస్ (Know your application status) తెలుసుకోండిలా..
ముందుగా ప్రజాపాలన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసే పనిలో అధికారులు ఉన్నారు. ఈనెల 17 వరకు నమోదు ప్రక్రియ నిర్వహిస్తారు. దరఖాస్తులు ఆౖన్‌లైన్‌లో ఎంట్రీ అయిన తర్వాత వెబ్‌సైట్‌లో దరఖాస్తు స్థితిని తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది. ముందుగా మీరు https://prajapalana.telangana.gov.in/Applicationstatus ఈ లింక్ మీద క్లిక్ చేయండి. అనంతరం అక్కడ మీకు అప్లికేషన్ నంబర్ కనిపిస్తుంది. మీ అప్లికేషన్ నంబర్ వివరాలు ఎంటర్ చేస్తే మీ దరఖాస్తు స్టేటస్ వివరాలు కనిపిస్తాయి. మీ దరఖాస్తు స్థితి, ఏఏ పథకాలకు అర్హులుగా ఉన్నారనే విషయాలను తెలుసుకోవచ్చు.కాగా ప్రజాపాలనను ప్రతీ నాలుగు నెలలకోసారి నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే.