Hyd, Jan 7: ఫార్ములా ఈ రేసింగ్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Former Minister KTR) వేసిన క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు (Telangana High Court) డిస్మిస్ చేసింది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులను కూడా ఎత్తివేసింది.ఏసీబీ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోలేమని, చట్ట ప్రకారం నడుచుకోవాలని అందరికి రూల్ ఆఫ్ లా వర్తిస్తుందని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
ఫార్ములా ఈ కార్ రేసింగ్‌లో నిధుల మళ్లింపు జరిగిదంటూ కేటీఆర్ సహా మరో ఇద్దరిపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఈ కేసులో కేటీఆర్‌ను ఏ1గా, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను ఏ2గా, హెచ్‌ఎండీఏ విశ్రాంత చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిని ఏ3గా చేర్చుతూ ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
ఈ నేపథ్యంలో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో రెండు సార్లు ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణకు రాగా.. కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దంటూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా క్వాష్ పిటిషన్ కొట్టివేసింది.ఇదిలా ఉంటే కేటీఆర్‌కు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు ఇవ్వడంతో వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు కేటీఆర్ లీగల్ టీమ్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.