High Court of Telangana| Photo Credits: Wikimedia Commons

Hyderabad, February 26: ప్రతిరోజు COVID-19 బులెటిన్‌ను విడుదల చేయాలని, రాష్ట్రంలో కోవిడ్ -19 పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వెల్లడించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్ట్ స్పష్టం చేసింది.  రాష్ట్రంలో ప్రతిరోజు కొత్తగా నమోదయ్యే కోవిడ్ కేసుల్లో గణనీయమైన మార్పులేమి ఉండటం లేదని చెప్తూ  తెలంగాణ ఆరోగ్యశాఖ రోజూవారీ కోవిడ్ బులెటిన్ విడుదల చేయడాన్ని నిలిపివేయడంతో హైకోర్ట్ ఈ విధంగా స్పందించింది.

అంతేకాకుండా కోవిడ్ సెకండ్ వేవ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు గుంపులుగా తిరగకుండా చూడాలని సూచించింది. టీకా నమోదు ప్రక్రియకు సంబంధించి విస్తృత ప్రచారం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరింది. అలాగే , వీలైనంత త్వరగా రాష్ట్రంలో సీరం సర్వే చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. జూన్ మరియు డిసెంబర్ మధ్య మూడు సీరం సర్వేలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని హైకోర్ట్ ఆదేశించింది.

ఇదిలా ఉంటే, మార్చి 1 నుండి తెలంగాణలో మూడవ విడత వ్యాక్సినేషన్ ప్రారంభం కాబోతుంది. టీకా పంపిణీలో భాగంగా రాష్ట్రంలో సుమారు 55 లక్షల మందికి వ్యాక్సిన్ డోసుల పంపిణీ చేసేందుకు రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి కోవిడ్ నివారణ వ్యాక్సిన్‌ను అందించడానికి కేంద్ర ప్రభుత్వం బుధవారం అనుమతి ఇచ్చింది.

తెలంగాణ ఆరోగ్య శాఖ అంచనా ప్రకారం రాష్ట్రంలో 60 ఏళ్లు పైబడిన వారు సుమారు 45 లక్షల మంది, 45 ఏళ్ల పైబడి కొమొర్బిడిటీ కలిగిన వారు సుమారు 10 లక్షల మంది ఉన్నారు. వీరికోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,500 వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆరోగ్య అధికారులు నిర్ణయించారు.