Hyderabad, August 31: తెలంగాణలో పాఠశాలలు మరియు కళాశాలలను సెప్టెంబర్ 1 నుంచి తిరిగి తెరవాలనే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంపై రాష్ట్ర హైకోర్ట్ మంగళవారం స్టే ఉత్తర్వులు ఇచ్చింది. ప్రత్యక్ష బోధనకు విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాలని బలవంతం చేయొద్దని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. ప్రత్యక్ష తరగతులకు హాజరుకాని విద్యార్థులపై గానీ, ప్రత్యక్ష తరగతులు నిర్వహించలేనటువంటి విద్యాసంస్థలపై గానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఆన్ లైన్ బోధన లేదా ప్రత్యక్ష బోధనపై నిర్ణయాన్ని విద్యాసంస్థలకే వదిలేయాలని సూచించింది. అలాగే ప్రత్యక్షంగా తరగతులు నిర్వహించాలనుకునే విద్యాసంస్థలకు వారం రోజుల్లో తగిన మార్గదర్శకాలను జారీ చేయాలని విద్యాశాఖను ధర్మాసనం ఆదేశించింది. విద్యాసంస్థల్లో కచ్చితంగా పాటించాల్సిన మార్గదర్శకాలపై విస్తృత ప్రచారం కల్పించాలని సూచించింది.
మరోవైపు గురుకులాలు మరియు హాస్టళ్లలో ప్రత్యక్ష బోధన చేపట్టవద్దని కూడా హైకోర్ట్ ఆదేశించింది. గురుకులాలు, హాస్టళ్లను ఇప్పుడప్పుడే తెరవొద్దని స్పష్టం చేసింది.
ప్రత్యక్ష బోధనపై లాభాలు ఉన్నప్పటికీ, నష్టాలు కూడా వెన్నంటే ఉన్నాయి. రాష్ట్రంలో కోవిడ్19 వ్యాప్తి ఇంకా కొనసాగుతుంది, సెప్టెంబర్- అక్టోబర్ నెలల్లో మూడో వేవ్ వచ్చే ముప్పుకూడా పొంచి ఉంది. కాబట్టి ప్రభుత్వం అన్నింటిని సమన్యయం చేసుకుంటూ ముందుకెళ్లాలని హైకోర్ట్ సూచించింది.
పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ మరియు ప్రైమరీ క్లాసుల్లోని విద్యార్థులకు ప్రత్యక్ష బోధనను వ్యతిరేకిస్తూ బాలకృష్ణ అనే ప్రైవేట్ టీచర్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) దాఖలు చేశారు. రాష్ట్రంలో కోవిడ్19 వ్యాప్తి మరియు థర్డ్ వేవ్ హెచ్చరికల నడుమ ప్రత్యక్ష బోధన సరికాదని పిటిషన్లో పేర్కొన్నారు. ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం మరియు మార్గదర్శకాలు లేకుండానే విద్యా సంస్థలను పున:ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆరోపించారు. పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన ఉన్నత న్యాయస్థానం సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు తెరవడాన్ని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.