telangana-huzurnagar-by-election-results-2019-counting-live-updates on latestly

Huzurnagar, October 24: తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న హుజూర్‌నగర్ ఉప-ఎన్నిక ఫలితం మరి కొద్ది గంటల్లో వెలువడనుంది. ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభమైంది. సూర్యాపేటలోని కొత్త వ్యవసాయ మార్కెట్టు గొడౌన్‌లోనే లెక్కింపు జరుగుతోంది. మొత్తం 22 రౌండ్ల పాటు లెక్కింపు జరగనుంది. దీనికోసం మొత్తం 14 టేబుళ్లు ఏర్పాటు చేయగా, రిటర్నింగ్‌ అధికారికి ప్రత్యేకంగా మరో టేబుల్‌ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఆయన ఈ ప్రక్రియను పరిశీలిస్తారు. ఒక్కో టేబుల్‌కు కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌, అసిస్టెంట్, పరిశీలకుడిని నియమించారు. లెక్కింపు ప్రక్రియను జిల్లా సాధారణ పరిశీలకుడు సచీంద్ర ప్రతాప్‌ సింగ్‌ పర్యవేక్షిస్తున్నారు. ప్రతి రౌండుకు ర్యాండమ్‌గా రెండు ఈవీఎంల ఫలితాలు సరి చూసిన తర్వాతే దాని ఫలితాన్ని వెల్లడిస్తారు.

లెక్కింపులో భాగంగా తొలుత ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌ఫర్‌ ఫర్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ సర్వీసు ఓట్ల లెక్కించనున్నారు. ఇందుకు 20 నుంచి 40 నిమిషాల సమయం పడుతుందని అధికారులు అంచనా వేశారు. మొత్తంగా 8.30 గంటల నుంచి ఈవీఎంల్లోని ఓట్లను లెక్కిస్తారు. ఒక్కో రౌండుకు 20 నిమిషాలు సమయం పడుతుంది. 21 రౌండ్లు పూర్తిస్థాయిలో, 22వ రౌండు పాక్షికంగా జరుగుతుంది.

ఈ ఎన్నికలో మొత్తం 28 మంది పోటీ పడ్డారు. నియోజకవర్గ వ్యాప్తంగా 7 మండలాల్లో 302 పోలింగ్‌ కేంద్రాల్లో 2,00,754 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 14 టేబుళ్లపై 22 రౌండ్లలో ఈ ఓట్ల లెక్కిపు పూర్తిచేస్తారు. ఒక్కో రౌండ్‌లో సుమారు 9 వేలపై చిలుకు ఓట్లను లెక్కిస్తారు. నేరేడుచర్ల మండలం నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమై వరుసగా పాలకీడు, మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం, హుజూర్‌నగర్‌ మండలం, పట్టణం, గరిడేపల్లి మండలంలోని లెక్కింపుతో పూర్తవుతుంది. లెక్కింపు అంతా పూర్తయ్యాక వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కిస్తారు. 302 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించి వరుసగా 1వ నంబర్‌ నుంచి 302 వరకు అంకెలను ఒక్కో స్లిప్పుపై వేస్తారు. వీటిలో 5 స్లిప్పులు డ్రా తీస్తారు. ఈ డ్రాలో వచ్చిన పోలింగ్‌ కేంద్రం స్లిప్పు ఆధారంగా ఆ పోలింగ్‌ బూత్‌లోని వీవీప్యాట్‌ స్లిప్పులు ఏ పార్టీకి ఎన్ని పడ్డాయో లెక్కిస్తారు.

ఈ స్లిప్పులను.. ఇదే పోలింగ్‌ బూత్‌లోని ఈవీఎంలలో ఆయా పార్టీకి పడిన ఓట్లు సమానంగా ఉన్నాయో లేదో సరి చూస్తారు. ఇది పూర్తయ్యాక అభ్యర్థులు ఎవరూ అభ్యంతరం చెప్పకపోతే రిటర్నింగ్‌ అధికారి గెలిచిన అభ్యర్థిని అధికారికంగా ప్రకటిస్తారు. మధ్యా హ్నం 12 గంటల వరకు తుది ఫలితం వెలువడుతుందని అధికారులు వెల్లడించారు.