Hyd, July 22: భాగ్య నగర ప్రజలకు కీలక సూచన చేశారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు (Hyderabad police). నగరంతో పాటు రాష్ట్రంలో పలు చోట్ల ఇవాళ ఉదయం నుంచి వాన దంచికొడుతోంది. ఆగి ఆగి కొడుతున్న వానతో జనం ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఈ రోజు (శుక్రవారం), రేపు(శనివారం) భారీ వర్షాలు ఉంటాయని చెప్పింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరుతోంది జీహెచ్‌ఎంసీ. అలాగే వర్షం తెరిపి ఇవ్వగానే ఆగమాగం బయటకు రావొద్దని ప్రజలకు సూచించారు. కొద్ది సమయం తర్వాతే బయటకు రావాలని.. అప్పుడే ట్రాఫిక్ సమస్యల నుంచి బయటపడొచ్చని తెలిపారు.
భారీ వర్షాలతో నగరం రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉంది. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవచ్చు కూడా. అందుకే నిమ్మలంగా బయటకు రావాలని ప్రజలకు సూచిస్తున్నారు అధికారులు. అలాగే.. విద్యార్థులు, వ్యాపారాలు చేసుకునేవాళ్లు, ఉద్యోగస్తులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరోవైపు రాష్ట్రంలో పలు జిల్లాలోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్‌లో ఈ రోజు ఉదయం నుంచి భారీ వర్షం (Hyderabad Rains) కురుస్తోంది.
తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం పడుతోంది. హైదరాబాద్‌లోని సికింద్రాబాద్, అల్వాల్, మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్ పల్లి, చందానగర్, తార్నాక, బాలానగర్, జీడిమెట్ల, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, యూసఫ్ గూడ, అమీర్ పేట్, ఎస్సార్ నగర్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్, మసబ్ ట్యాంక్, కాచిగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయం (Heavy Rain Lashes in Hyderabad) అయ్యాయి.