Hyd, Mar 3: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన ఇబ్రహీంపట్నం రియల్టర్ల జంట హత్యల కేసులో (Ibrahimpatnam shooting) మిస్టరీ వీడింది. మట్టారెడ్డి సహా ఐదుగురి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు ఆయుధాలు, 20 రౌండ్ల బులెట్లు స్వాధీనం చేసుకున్నారు. మట్టారెడ్డిని కీలక సూత్రధారిగా పోలీసులు తేల్చారు. లేక్‌విల్లా భూ వివాదమే హత్యకు (Telangana Ibrahimpatnam shooting) కారణంగా పోలీసులు (Rachakonda Police) నిర్థారించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మీడియాకు వెల్లడించారు. 48 గంటల పాటు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నామని తెలిపారు.
మట్టారెడ్డికి గతంలో నేర చరిత్ర ఉందని తెలిపారు. మట్టారెడ్డి గెస్ట్ హౌస్ వద్ద సీపీ ఫుటేజీ లభించడంతో కీలక ఆధారం లభించిందని సీపీ తెలిపారు.సరూర్ నగర్ ఎస్‌వోటీ కార్యాలయంలో నిందితులను విచారిస్తున్నారు. ఈ కేసులో లేక్ వ్యూ విల్లా ఓనర్స్ అసోసియేషన్ సభ్యులను సైతం పోలీసులు విచారిస్తున్నారు. సుపారీ గ్యాంగ్‌తో శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలను మట్టారెడ్డి హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
మార్చి 1న ఇబ్రహీంపట్నంలో కాల్పులు జరిగాయని తమకు ఫిర్యాదు వచ్చిందన్నారు. రియల్ ఎస్టేట్ శ్రీనివాస్ రెడ్డి స్పాట్‌లో చనిపోయాడన్నారు. మరో రియల్ ఎస్టేట్ వ్యాపారీ రాఘవేందర్ రెడ్డి హాస్పిటల్‌లో మృతి చెందాడన్నారు. లేక్ వ్యూ వెంచర్ ఫ్లాట్స్ గొడవలో ఈ కాల్పులు జరిగాయని తెలిసిందన్నారు. సైంటిఫిక్ ఆధారాలతో, సీసీ ఫుటేజ్, సీడీఅర్ అనాలిసిస్‌తో కేసును ఛేదించామన్నారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించామని సీపీ పేర్కొన్నారు.