File image of Telangana CM KCR | File Photo

Hyderabad, March 31: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కరోనా వైరస్ వ్యాప్తి (COVID 19 Outbreak) తీవ్రమైన ప్రభావం చూపుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఆర్థికస్థితిగతులపై ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్ (CM KCR) వివిధ రకాల వేతనాల చెల్లింపులపై కోత (Pay Cut) విధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మార్చి నెల నుంచే కోతలు వర్తిస్తాయని ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. ప్రజా ప్రతినిధులు మరియు ప్రభుత్వ ఉద్యోగుల మొత్తం గ్రాస్ సాలరీలను (Gross Salary) నుంచి ఈ కోత విధించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా తదుపరి ఉత్తర్వులు వెలువరించేంత వరకు ఈ కోత అమలులో ఉంటుందని తెలిపారు.

ప్రభుత్వం జారీ చేసిన మార్గ దర్శకాల ప్రకారం కోతలు ఈ విధంగా ఉండనున్నాయి;

  • ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రివర్గం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కోత విధిస్తారు.
  • ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ లాంటి అఖిల భారత సర్వీసు అధికారుల వేతనాల్లో 60 శాతం కోత విధిస్తారు.
  • అన్ని కేటగిరీల ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోత విధిస్తారు.
  • అన్ని రకాల రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో 50 శాతం కోత విధిస్తారు.
  • నాల్గవ తరగతి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత విధిస్తారు.
  • నాల్గవ తరగతి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ లో 10 శాతం కోత విధిస్తారు.
  • ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగుల వేతనాల్లో కూడా కోత వర్తిస్తుంది.

కోతలు పోను మిగతా వేతనాలను విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఉద్యోగులు, పెన్షనర్ల జీతాల కోసం ప్రభుత్వం ప్రతి నెల సుమారు రూ. 3,500 కోట్ల పైన వెచ్చిస్తుంది. ఈ కోతల ద్వారా ప్రభుత్వానికి రూ. 1,700 కోట్లు ఆదా అవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది.

అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని టీస్ పీఆర్టీయూ స్వాగతించగా, ఉద్యోగులు, టీచర్లు మరియు పెన్షర్ల ఐక్య వేదిక ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించింది. ఉద్యోగుల కోతలపై ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేసింది.

నెలనెలా అద్దె చెల్లింపులు, ఎల్ఐసీ చెల్లింపులు, ఇతర డిడక్షన్స్ మరియు చిట్టీలకు చేసే చెల్లింపులు, ఇల్లు గడవటానికి ఎన్నో ఖర్చులు ఉంటాయి, అవన్నీ పోతే ఉన్న జీతంలోనే ఏమి మిగలవు అలాంటిది ఇప్పుడు గ్రాస్ సాలరీలోనే 50 శాతం కోత విధిస్తే తామేమి తిని బ్రతకాలంటూ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొంత మంది ప్రతిపక్ష నేతలు కూడా ఉద్యోగులు, పిన్షనర్ల వేతనాల కోతలను తప్పుపట్టారు. దీనికి బదులుగా ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకోవాలని, సంక్షేమానికి వెచ్చించే కేటాయింపులు, కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులకు వెచ్చించే కేటాయింపులు కొంత కాలం పాటు నిలిపివేయాలని సూచిస్తున్నారు.