Hyderabad, Mar 20: తెలంగాణ ఐపీఎస్ అధికారి, స్వేరోస్ సంస్థ అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ (IPS Officer RS Praveen Kumar) వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. స్వేరోస్ భీమ్ దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో స్వేరో సభ్యులతో కలసి ఆయన హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయడం వివాదాస్పదంగా మారింది. తాము రాముడు, కృష్ణుడును నమ్మబోమని, పెద్దలకు పిండ ప్రదానాలు లాంటివి కూడా చేయబోమంటూ కొందరు ప్రతిజ్ఞ చేస్తుంటే వారితో పాటు ప్రవీణ్ కుమార్ (Swaeroes IPS Praveen Kumar) కూడా చేతులు చాచి ప్రతిజ్ఞ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది.
ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై వీహెచ్‌పీ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హిందువుల విశ్వాసాలను గాయపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ దేవతల పట్ల విషం కక్కుతూ ప్రతిజ్ఞ చేసిన ప్రవీణ్ కుమార్‌పైన కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని రావినూతల శశిధర్ డిమాండ్ చేశారు. ప్రవీణ్ కుమార్‌ను సర్వీస్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
అంబేద్కర్ అందించిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఐపీఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్ కుమార్ రాజ్యాంగ బాధ్యతలకు విరుద్ధంగా హిందువుల విశ్వాసాలను గాయపరిచాడని ధ్వజమెత్తారు. స్వైరోస్‌పై పలు ఆరోపణలు వస్తున్నా గురుకుల విద్యావ్యవస్థలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను సుదీర్ఘ కాలం ప్రభుత్వం ఎందుకు కొనసాగిస్తోందో సమాధానం చెప్పాలని రావినూతల శశిధర్ డిమాండ్ చేశారు. గురుకుల విద్యావ్యవస్థకు మరో ఐఏఎస్ అధికారిని నియమించాలని రావినూతల శశిధర్ డిమాండ్ చేశారు.
Here's Video
Telangana IPS officer RS Praveen kumar taking pledge that he doesn't have belief in Hindu Gods & Customs...
But what about his belief in Allah & Jesus??? pic.twitter.com/VqJurHi6OZ
— #Vakeel Saab ⚖️ (@karunasagarllb) March 15, 2021
‘తెలంగాణలో బాద్యతాయతమైన ఓక IPS అధికారిగా ఉండి చిన్న పిల్లల మెదడులల్లో విషబీజాలు నాటుతున్నారు? ప్రవీణ్ కుమార్ గారు ఇదేనా మీరు ఐపీఎస్ లో శిక్షణ పొందింది? బహిరంగంగా హిందూ దేవీ దేవతలను కించపరుస్తూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్న ప్రవీణ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి.’ అని ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ చేశారు.
ప్రవీణ్ కుమార్ వ్యవహారంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌కు నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణ రాజు ఫిర్యాదు చేశారు . స్వేరోస్ సంస్థ కార్యకలాపాలు, స్వేరోల ఆగడాలు, 7 ఏళ్ల నుండి అదే పోస్టులో ప్రవీణ్ కుమార్ పాతుకుపోవడం, డీవోపీటీ నిబంధనల అతిక్రమణ వంటి అంశాలను ప్రవీణ్ కుమార్ ఫిర్యాదులో ప్రస్తావించారు.
అయితే స్వేరోస్ వివాదాస్పద ప్రతిజ్ఞపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోన్న ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్ దీనికి సంబంధించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తనపై హిందూ వ్యతిరేకిగా బీజేపీ నేతలు ముద్రవేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన కౌంటర్ ఇచ్చారు. తన భార్య, సోదరి అందరూ హిందువులేనని ఆయన తెలిపారు.
Here's clarification
This is my clarification on what has appended in Dhulikatta Buddhist Shrine today. Once again I reiterate Swaeroism is inclusive ideology and we have people with all religious faiths working for liberation of poor from poverty. #swaero pic.twitter.com/h08wKjXcd9
— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) March 15, 2021
” నేను స్వేరోస్ లో సభ్యుడిని.. నా భావజాలం అందులో ఉంది. స్వేరోస్ సంస్థకు విదేశీ నిధులు వస్తున్నాయనేది అవాస్తవం. నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం. స్వేరోస్ ప్రభుత్వానికి సమాంతర వ్యవస్థ కాదు. నేను ఏ పదవిలోనైనా పనిచేయడానికి సిద్ధం. దేశంలో హిందూ, నాన్ హిందూ విభజన రేఖలు పెరుగుతున్నాయి. బీజేపీ నేతల ఆరోపణలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. అని ప్రవీణ్ కుమార్ అన్నారు.
ఇలా ఉండగా, తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదివిన పూర్వ విద్యార్థుల సంఘం స్వేరో యూనియన్ ఏటా భీమ్ దీక్ష పేరుతో ఒక కార్యక్రమం నిర్వహిస్తుంటుంది. కాన్షీరాం జయంతి నుంచి అంబేడ్కర్ జయంతి వరకూ నెల రోజుల పాటూ ఇది సాగుతుంది. ఏటా ఈ ఉత్సవాలను ప్రత్యేకంగా నిర్వహిస్తారు స్వేరో పూర్వ, ప్రస్తుత విద్యార్థులు. ఈసారి తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా ధూళికట్ట వద్ద 2 వేల ఏళ్ల నాటి ప్రాచీన బౌద్ధ స్తూపం దగ్గర ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఆ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రతిజ్ఞ చేస్తున్న వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో హిందూ దేవుళ్లపై తనకు నమ్మకం లేదు అన్న మాటలు వినిపించడంతో బీజేపీ నేతలు సహా పలువురు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు, ప్రవీణ్ కుమార్ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నరన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. కొందరు కేసులు పెట్టారు. ఆయనతో పాటు మొత్తంగా స్వేరో సంస్థ హిందూ వ్యతిరేక భావాలను ప్రచారం చేస్తోందన్న ఆరోపణలు కూడా పెరుగుతోన్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంట బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ తిప్పికొట్టారు. ఆ ప్రతిజ్ఞ చేసిన కుటుంబంతో తనకు, స్వేరోస్ సహచరులకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. అది ఓ ప్రైవేటు కార్యక్రమమని స్పష్టం చేశారు. అలాగే అసలు ఏం జరిగిందో ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ వివరించారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.
‘‘పెద్దపల్లి జిల్లా ధూలికట్లలోని ప్రముఖ బుద్ధిస్ట్ పుణ్యక్షేత్రంలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే ‘స్వేరోస్ పవిత్ర నెల (మార్చి 15- ఏప్రిల్ 14)లో నేను పాల్గొన్నాను. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు వేలాది మంది హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమం తర్వాత ఓ బుద్ధిస్ట్ ఫ్యామిలీ స్టేజ్‌పైకి వచ్చింది. ఈ సందర్భంగా 1956లో మహారాష్ట్రలోని నాగపూర్‌లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ దీక్షభూమిలో బౌద్ధమార్గంలోకి మారే క్రమంలో చేసిన ప్రయాణాన్నే ఆ కుటుంబం చేసింది.
అయితే ఆ కుంటుంబంతో నాకు గాని, నా స్వేరోస్ సహచర సభ్యులకు గాని ఎలాంటి సంబంధం లేదు. అలాగే ఈ బుద్ధవందనం తర్వాత ఆ ఫ్యామిలీ చేసిన ప్రమాణంతో మాకు సంబంధం లేదని స్టేజ్‌పైనే చెప్పాం. ఇదే విషయాన్ని కార్యక్రమ నిర్వహకులు కూడా అందరికీ వివరించారు. ఒకవేళ దీనికి సంబంధించి ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే చింతిస్తున్నాను.
స్వేరోస్ సంస్థలో అన్ని మతాలకు చెందిన వారు ఉన్నారు. మేము అన్ని మతాలను గౌరవిస్తాం. అలాగే మా ఇళ్లలో గాని, పని స్థలాలు, ఫంక్షన్లలో గాని ఎక్కడా ఏ మతానికి వ్యతిరేకంగా బోధించం. చదువు, ఆరోగ్యం పట్ల అవగాహన, శాస్త్రీయ ఆలోచన, ఆర్థిక స్వావలంబన ద్వారా మన దేశంలో సమానత్వం సాధన కోసం తాము పని చేస్తున్నాం. కానీ, ద్వేషాన్ని ఎప్పుడూ ప్రచారం చేయబోము.’’ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న వారికి చురకలంటించారు.
కాగా, 1956లో మహారాష్ట్రలోని నాగపూర్‌లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ హిందూ ధర్మాన్ని విడిచిపెట్టి బౌద్ధధర్మం స్వీకరించినప్పుడు ఇదే ప్రమాణం చేశారు. అప్పటి నుంచి ఎవరైనా హిందూ ధర్మం నుంచి బౌద్ధంలోకి మారే సమయంలో ఈ ప్రతిజ్ఞ చేస్తారు. తాజాగా, తాను పాల్గొన్న కార్యక్రమంలోనూ ఆ ఫ్యామిలీ ఇదే ప్రమాణం చేసినట్లు ఐపీఎస్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.