KA Paul House Arrest: 150 దేశాలను వణికించి వచ్చా.. కేసీఆర్, కేటీఆర్‌లకు భయపడే ప్రసక్తే లేదు, పోలీసులు హౌస్ అరెస్టు అనంతరం మండిపడిన కేఏ పాల్‌
KA Paul (Photo-Twitter)

Hyd, May 3: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. తనపై జరిగిన దాడి గురించి ఫిర్యాదు చేసేందుకు డీజీపీ కార్యాలయానికి వెళ్లాలని పాల్ భావించారు. ఈ నేపథ్యంలో కేఏ పాల్‌ను పోలీసులు గృహ నిర్బంధం (KA Paul House Arrest) చేశారు. అమీర్‌పేట్‌లోని ఆయన నివాసం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిద్ధిపేటలో సోమవారం తనపై జరిగిన దాడి గురించి డీజీపీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు.

సిరిసిల్ల ఎస్పీ, డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్‌లను సస్పెండ్‌ చేయాలని కోరుతూ కేఏ పాల్‌ డీజీపీని కలవాలని అనుకున్నారు. కేఏ పాల్‌ వస్తుండటంతో డీజీపీ కార్యాలయం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే మరికాసేపట్లో డీజీపీ కార్యాలయానికి బయలుదేరుతారనే క్రమంలో పోలీసులు ఆయన్ను హౌజ్‌ అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా కేఏ పాల్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో నిన్న(సోమవారం) బ్లాక్ డే అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ తనపై దాడి చేయించారని ఆరోపించారు.

దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని గుండాగిరి ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ చేస్తున్నారని విమర్శించారు. సిద్ధిపేటలో జరిగిన సంఘటన కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని అన్నారు. కేటీఆర్‌ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇచ్చిన వ్యక్తే తనపై దాడి చేశారని తెలిపారు. 150 దేశాలను వణికించి వచ్చానని చెప్పిన కేఏ పాల్‌.. కేసీఆర్, కేటీఆర్‌లకు నేను బయపడేది లేదని స్పష్టం చేశారు. డీజీపీ మహేందర్ రెడ్డికి నిన్నటి నుండి కాల్ చేస్తుంటే ఇప్పటి వరకు కాల్ లిఫ్ట్ చెయ్యడం లేదు. డీజీపీ దగ్గరకు వెళ్లకుండా నన్ను ఇప్పుడు హౌస్ అరెస్ట్ చేశారు.

రైతు కుటుంబాల పరామర్శకు వెళ్లిన కేఏ పాల్‌పై టీఆర్ఎస్ కార్యకర్త దాడి, తనపై దాడి చేసిన వారిని అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేసిన ప్రజాశాంతి పార్టీ జాతీయ అధ్యక్షుడు

నన్ను ఎంతకాలం నిర్భంధిస్తారు. నాపై తెలంగాణ వ్యతిరేకి ముద్ర వేస్తున్నారు. రైతులను కలవడం తప్పా. సిరిసిల్ల రైతులకు అండగా నిలవడం నేను చేసిన తప్పా. నాపై జరిగిన దాడి తెలంగాణ ప్రజల మీద జరిగిన దాడి. పీకేతో నేను టచ్‌లో ఉన్నాను. అన్ని పార్టీలను కలపాలని ముఖ్యమంత్రి చెప్పారని పీకే నాతో చెప్పాడు. అన్ని పార్టీలకు సభలకు అనుమతులు ఇస్తున్నారు నాకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు. ఆరు నెలల్లో నేను లక్ష ఉద్యోగాలు ఇస్తాను. అలా ఇవ్వకపోతే నా పాస్ పోర్టును సీజ్ చేసుకోండి. మళ్లీ సిరిసిల్ల వస్తున్నా దమ్ముంటే ఆపు.. నా ప్రాణం ఉన్నంత వరకు ఇక్కడే ఉంటా’ అని సవాల్‌ విసిరారు.

రైతులు పిలిస్తే నేను వెళ్ళాను. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 150 ఎకరాలు పంట నష్టం వాటిల్లిందని నేను వెళ్ళాను. సిరిసిల్ల వెళ్తుండగా మమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత టిఆర్ఎస్ నేతలు రావడం జరిగింది. రైతులను నేను దూషించాను అని అంటున్నారు. అది అవాస్తవం. నేను ఎవ్వరిని దూషించలేదు. నాపై జరిగిన దాడి ని ప్రతి ఒక్క కుల సంఘాలు, వివిధ పార్టీలు ఖండించారు. ప్రత్యేక రాష్టం కావాలని నేను కోరుకున్నా. నేను ఆంధ్ర వాడిని అని అంటున్నారు. మరి కేసీఆర్ ఎక్కడి నుండి వచ్చారో తెలుసుకోవాలి. నా పేరు మీద ఎలాంటి ఆస్తులు లేవు, అన్ని చారిటీల మీద ఉన్నాయన్నారు.

కాగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడి (KA Paul Attacked by TRS Party leaders) చేసిన సంగతి విదితమే. వడగండ్ల వానకు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేఏ పాల్ కారు దిగి టీఆర్‌ఎస్ కార్యకర్తలతో మాట్లాడుతుండగా అక్కడే ఉన్న టీఆర్‌ఎస్ కార్యకర్త ఆయనపై చేయి చేసుకున్నారు. పాల్‌పై దాడి చేయడంతో ఆయన అనుచరులు నిరసనకు దిగారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరువర్గాలను కట్టడి చేసేందుకు ప్రయత్నించారు.

తెలంగాణకు ఆరెంజ్‌ అలర్ట్‌, మరో నాలుగు రోజులపాటు ఎండలతో అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక

 మే 28‌న పరేడ్ గ్రౌండ్స్‌లో సభ పెడతానని కేఏ పాల్ వెల్లడించారు. కవితను అరవింద్ ఓడించినట్లు కేసీఆర్, కేటీఆర్‌ను కూడా ప్రజలు ఓడిస్తారని చెప్పారు. కేసీఆర్ హిట్లర్‌లాగా ప్రవరిస్తున్నారని పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు 10 యుద్ధాలు ఆపానని, కోదండరాంను తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లు తెలిపారు. ఆలోచించి చెపుతానని కోదండరాం చెప్పినట్లు కేఏ పాల్ పేర్కొన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలని కోరుతున్నానని చెప్పారు. మళ్ళీ తాను సిరిసిల్ల వెళ్తానని స్పష్టం చేశారు. బంగారు తెలంగాణను చేసేంత వరకు తాను పోరాటం చేస్తానని తెలిపారు.

కేసీఆర్‌కు తాను గతంలో సపోర్ట్ చేశాననన్నారు. తెలంగాణలో మార్పు రావాలని, కేసీఆర్‌ను ప్రశాంత్ కిషోర్, చిన్నజీయర్ స్వామి ఎందుకు వదిలేశారో తెలియాలన్నారు. సిరిసిల్ల ఎస్పీ, డీఎస్పీ, ఇన్స్ పెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రికి లేఖ రాశానని కేఏ పాల్ తెలిపారు. పీకే జాతీయ పార్టీ వెనుక కేసీఆర్ ఉన్నారని ఆరోపించారు. కేసీఆర్ పది వేల కోట్లు ఇస్తాడని పీకే తనతో చెప్పారని కేఏ పాల్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తోందన్నారు. తాను ఎక్కడ పోటీ చేసినా గెలుస్తానని దీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎక్కడ పోటీ చేస్తానో ఇప్పుడే చెప్పలేనని కేఏ పాల్ పేర్కొన్నారు.

ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్, పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని ఆకాంక్షించిన తెలంగాణ ముఖ్యమంత్రి

దూకుడుగా వస్తున్న టీఆర్‌ఎస్ కార్యకర్తలను పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. పాల్‌ను సిరిసిల్ల జిల్లాకు రాకుండా పోలీసులు హైదరాబాద్‌కు వెనక్కి పంపారు. పాల్‌పై చేయిచేసుకున్న టీఆర్‌ఎస్ కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాల్‌పై దాడి చేసిన వ్యక్తిని తంగాళ్లపల్లి మండలం జిల్లెళ్లకు చెందిన అనిల్‌రెడ్డిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ యూత్‌ నాయకుడిగా, నేరెళ్ల సింగిల్ విండో డైరెక్టర్‌గా అనిల్‌రెడ్డి ఉన్నారు.