Hyderabad, June 7: తెలంగాణలో సెకండ్ వేవ్ కరోనా కట్టడిలో భాగంగా ప్రస్తుతం అమలులో ఉన్న లాక్‌డౌన్ గడువు జూన్ 9తో ముగిసిపోతుంది.
ఆరోగ్యశాఖ నివేదికల ప్రకారం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చినట్లే అనిపిస్తోంది. లాక్‌డౌన్ విధించిక నాటి రోజులతో పోలిస్తే ప్రస్తుతం 75 శాతం కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. తెలంగాణలో లాక్‌డౌన్ విధించముందు రోజు మే 11న 4,801 కోవిడ్ కేసులు నమోదు కాగా, నిన్న ఆదివారం 1,436 కేసులు వచ్చాయి. గత నెల రోజులుగా తీసుకున్న పకడ్బందీ చర్యల వలన రాష్ట్రంలో సెకండ్ వేవ్ అదుపులోకి వచ్చిందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణ కోసం రాష్ట్ర కేబినేట్ రేపు సమావేశం కాబోతుంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమయ్యే మంత్రివర్గం సమావేశంలో లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం ఉన్న సడలింపులు జూన్ 10 నుంచి మరింత పెంచుతూ, కేవలం నైట్ కర్ఫ్యూ విధించే అవకాశం ఉందని పలు నివేదికలు విశ్లేషించాయి.
అలాగే, లాక్‌డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ మేరకు ప్రభావితమైంది? ఇందుకోసం శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలపై కేబినేట్‌లో చర్చించనున్నారు. మరోవైపు థర్డ్ వేవ్ రానున్నదనే వార్తల నేపథ్యంలో, రాష్ట్రంలో థర్డ్ వేవ్‌ను కూడా సమర్థవంతంగా ఎదుర్కునేందుకు రాష్ట్ర వైద్యశాఖ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్ల మీద కేబినెట్ చర్చించనుంది.
వీటితో పాటు వానాకాలంలో వ్యవసాయ పనులు, రైతుబంధు పంపిణీ, ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతి తదితర సంబంధిత అంశాల మీద సమీక్ష జరిగే అవకాశమున్నది.
ఇక ఈరోజు నుంచి ప్రారంభించాలనుకున్న 19 జిల్లాల్లో 19 ఉచిత డయాగ్నస్టిక్ సెంటర్లను జూన్ 9 నుంచి ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అందరూ ఒకే సారి, ఒకే సమయంలో ఆయా జిల్లాల్లో 19 సెంటర్లను ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. మంత్రులు లేని చోట ఇతర ప్రముఖులను ఆహ్వానించి వారి చేతుల మీదుగా డయాగ్నస్టిక్ సెంటర్లను ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. ఇందుకోసంఎవరెవరు ఎక్కడెక్కడ పాల్గొనాలనే విషయంపై రేపటి మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.