Hyd, April 21: బుధవారం వరంగల్ జిల్లాలో పర్యటించిన కేటీఆర్ బీజేపీ పార్టీపై, నేతలపై విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం (Telangana State) నుంచి వెళ్తున్న ఆదాయంతోనే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వెలుగులు నిండుతున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు (Minister KTR) అన్నారు. కేంద్రం నిధులతోనే తెలంగాణలో అంతా జరుగుతున్నదని బీజేపీ నేతలు (BJP Leaders) తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏడున్నరేండ్లలో తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి రూ.3, 65,790 కోట్లు ఇస్తే, కేంద్రం తిరిగి రాష్ర్టానికి ఇచ్చింది రూ.1, 68, 640 కోట్లు మాత్రమేని స్పష్టం చేశారు.
ఈ లెక్కలు తప్పని బీజేపీ నేతలు నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా (Minister KTR Open Challenge) చేస్తానని, పదవిని ఎడమ కాలు చెప్పు లెక్క వదులుకొని సాధారణ ఎమ్మెల్యేగా ఉంటానని సవాల్ విసిరారు. తెలంగాణ ఇచ్చిన నిధులను ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి బుల్డోజర్ ఉపయోగించే రాష్ర్టాలకు బీజేపీ పంపిందని ఆరోపించారు. గుజరాత్‌లో నడిచే బుల్లెట్ రైలుకు కూడా తెలంగాణ పైసలు పోయాయని తెలిపారు.
వరంగల్ లో రూ.188 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన బేకార్, లుచ్చా పార్టీ బీజేపీ అని ధ్వజమెత్తారు. తెలంగాణకు ఏమీ చేయని మోదీ ఎందుకు? బోడి బీజేపీ ఎందుకు? అని మండిపడ్డారు.
తెలంగాణ నుంచి గెలిచిన నలుగురు బీజేపీ ఎంపీలు మోదీని ఏదీ అడగరు. నేరుగా ఆయనను చూసుడు కూడా డౌటే. కిటికీ నుంచి చూసి వస్తరనుకుంట. ఆ నలుగురు ఎంపీలది ఒక్కో రకం. కరీంనగర్‌లో గెలిచినాయనకు అక్కడ్నే దిక్కులేదు. నిజామాబాద్‌లో గెలిచిన వ్యక్తి వారం రోజుల్లో పసుపు బోర్డు తెస్తనని బాండ్ పేపర్ ఇచ్చిండు.. ఇప్పుడు కేసీఆర్‌ను బూతులు తిట్టుడు తప్ప చేసిందేమీలేదు. ఆదిలాబాద్ ఎంపీ సిమెంట్ కార్పొరేషన్ ఇండియాను తెరిపిస్తానని చెప్పిండు. దాన్ని కేంద్రం అమ్ముతుంటే ఏమీ చేయడు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషినల్ ట్రీట్‌మెంట్‌ను తెలంగాణలో పెడుతున్నామని 20 రోజుల కింద చెప్పిండు. మోదీ గుజరాత్‌కు పోయి జామ్‌నగర్‌లో పెడుతున్నమని ప్రకటించిండని మండి పడ్డారు.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ ఏమయ్యాయి? మన కోచ్ ఫ్యాక్టరీ గురించి అడిగితే కొత్తగా కోచ్ ఫ్యాక్టరీలను ఏర్పాటుచేసే ఆలోచన లేదని చెప్పిన కేంద్రం, 2016లో మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం అడగ్గానే మంజూరు చేసి 2018లోగానే పూర్తి చేసింది. కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టుల్లో ఒక్కదానికీ జాతీయ హోదా ఇవ్వలేదు. ఇవన్నీ తెలియని కొందరు కుక్కల్లాగా సీఎం కేసీఆర్‌పై మొరుగుతున్నారు. ఇక్కడి బేకార్ బీజేపీ నాయకులకు ఈ అన్యాయం పట్టదని మండిపడ్డారు.
బీజేపీ బఫూన్ గాండ్ల పార్టీ. బుట్టాచోర్ గాళ్లు, బట్టేబాజ్ గాళ్లు చిల్లరమాటలు మాట్లాడితే సహించేది లేదు. తిరగబడి ఇరగదీయాలని అన్నారు. నో డౌట్.. మరో సంవత్సరం వరకు ఎలాంటి ఎలక్షన్లు లేవు. కార్యకర్తలు అలర్ట్‌గా ఉండాలి. వరంగల్ నుంచే మొదలుకావాలె. బీజేపీ వాళ్లతోని ఆగం కావద్దు. ఆగమైతే వాళ్లు మనల్ని మళ్లీ ఆంధ్రలో కలుపుతరాని మంత్రి అన్నారు.