HYD, Nov 14: తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Telangana MLC Election Results 2021) అధికార టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ పార్టీనే (TRS Party) కైవసం చేసుకుంది. విపక్షాలు కనీసం పోటీలో కూడా నిలవలేకపోయాయి. మొత్తం 12 స్థానాల్లో 6 స్థానాలు ఏకగ్రీవం కాగా, మరో 6 స్థానాలకు ఎన్నికలు (Telangana MLC Election) నిర్వహించారు. ఈ ఆరు స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులే గెలుపొందారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి టీఆర్ఎస్ అభ్యర్థులు భానుప్రసాద్ రావు, ఎల్ రమణ, ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి వంటేరు యాదవరెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి తాతా మధు, ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఎం కోటిరెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి దండె విఠల్ గెలుపొందారు. ఏకగ్రీవంగా ఎన్నికైన టీఆర్ఎస్ అభ్యర్థులు.. ఉమ్మడి నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజు, వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మహబూబ్‌నగర్ నుంచి కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, కశిరెడ్డి నారాయణరెడ్డి గెలిచారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భానుప్రసాద్ రావుకు 584 ఓట్లు రాగా, ఎల్ రమణకు 479 ఓట్లు వచ్చాయి. మొత్తం 1320 ఓట్లు పోల్ కాగా, 1303 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. 17 ఓట్లు చెల్లుబాటు కాలేదు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్‌ఎస్ అభ్యర్థి యాదవరెడ్డికి 762 ఓట్ల వచ్చాయి. సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థికి 238 ఓట్లే పోలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థికి కేవలం ఆరు ఓట్లే వచ్చాయి. మెదక్ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 12 ఓట్లు చెల్లనివిగా తేలాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 1271 ఓట్లకుగానూ 1233 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 50 ఓట్లు చెల్లనివని అధికారులు తేల్చారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఎం కోటిరెడ్డికి ఏకంగా 917 ఓట్లు వచ్చాయి. ఆయనపై పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి నగేష్‌కు 226 ఓట్లు వచ్చాయి. మొత్తం 691 ఓట్ల మెజార్టీతో కోటిరెడ్డి విజయం సాధించారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధు గెలుపొందారు. టీఆర్ఎస్ అభ్యర్థికి 480 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థికి 242 ఓట్లు వచ్చాయి. తన సమీప ప్రత్యర్థిపై తాతా మధు 238 ఓట్ల మెజార్టీతో మధు గెలుపాందారు. ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో 12 చెల్లని ఓట్లు ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థికి కేవలం 4 ఓట్లే వచ్చాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. ఇక్కడ మొత్తం 862 ఓట్లు పోలవగా.. టీఆర్‌ఎస్ అభ్యర్థి దండె విఠల్‌కు మొత్తం 740 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి, స్వతంత్ర అభ్యర్థి పుష్కరానికి కేవలం 74 ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం 666 ఓట్ల మెజార్టీతో విఠల్ విజయం సాధించారు. ఆదిలాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం చెల్లని ఓట్లు 48 నమోదయ్యాయి.