Hyderabad, Mar 21: తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో (Telangana MLC Election 2021 Results) టీఆర్‌ఎస్ విజయం సాధించింది. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ స్థానంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి (surabhi Vanidevi), నల్లగొండ-ఖమ్మం- వరంగల్ స్థానంలో డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి (Palla Rajeshwar Reddy) గెలిచారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానాన్ని బీజేపీ నుంచి వశం చేసుకున్న టీఆర్‌ఎస్ నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌లో వరుసగా రెండోసారి గెలుపొందింది.
దాదాపు నాలుగురోజుపాటు ఉత్కంఠ భరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో ఆదినుంచీ గులాబీ పార్టీ అభ్యర్థులు తమ ఆధిక్యతను ప్రదర్శించారు. ఎలిమినేషన్ ప్రక్రియ మేరకు రెండో ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. పోలింగ్‌కు కేవలం 21 రోజులముందు టీఆర్‌ఎస్ అభ్యర్థిగా అనూహ్యంగా తెరపైకి వచ్చిన వాణీదేవి అతికొద్ది సమయంలోనే సిట్టింగ్ అభ్యర్థి, బీజేపీకి చెందిన రాంచందర్‌రావును మట్టి కరిపించారు.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి 49,362 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. గెలుపునకు అవసరమైన 1,83,167 మార్కును ఎవరూ చేరుకోకపోవడంతో నిభందనల ప్రకారం రెండో స్థానంలో ఉన్న తీన్మార్ మల్లన్నను అధికారులు ఎలిమినెట్ చేశారు. మల్లన్నకు వచ్చిన ప్రథమ ప్రాధాన్యత బ్యాలెట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించగా.. పల్లాకు 36,556 ఓట్లు పోలయ్యాయి. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 1,61,811 ఓట్లు, తీన్మార్ మల్లన్నకు 1,49,005 ఓట్లు వచ్చాయి. ఓట్ల లెక్కింపులో ఆది నుంచి మూడో స్థానంలో కొనసాగిన కోదండరామ్ చివరకు ఎలిమినేట్ అయ్యారు.
Palla Rajeshwar Reddy Wins
వరంగల్- ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక గెలుపు పత్రాన్ని రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. pic.twitter.com/Fln5JCJsxU
— Dr. Palla Rajeshwar Reddy (@PRRTRS) March 20, 2021
Palla Rajeshwar Reddy( @PRRTRS ) of @trspartyonline won from Warangal-Khammam-Nalgonda Graduates' MLC seat by getting 198367 votes. pic.twitter.com/7cCbdA1brt
— Lok Poll (@LokPoll) March 21, 2021
దీంతో 71వ రౌండ్‌లో గెలుపు కోటాను దాటారు. ప్రొఫెసర్ కోదండరామ్ ఎలిమినేషన్‌తో పల్లా ఓట్లు 1,61,811కు చేరాయి. మల్లన్న ఎలిమినేషన్‌తో ఆ సంఖ్య 1,98,367కు చేరింది. దీంతో కోదండరామ్ ఎలిమినేషన్ అప్పుడు 12,806గా ఉన్న పల్లా మెజారిటీ 49,362కు పెరిగింది. మొత్తంగా ఆయనకు 1,10,840ల మొదటి ప్రాధాన్యత ఓట్లు రాగా, 87,527 రెండో ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి.
తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ ఇన్ని ఓట్లు రాకపోవడంతో ఎలిమినేషన్ పద్ధతిలో తదుపరి ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు.
తొలి ప్రాధాన్యతలో అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఒక్కొక్కరుగా ఎలిమినేట్ చేస్తూ వారి బ్యాలెట్లలో ఉన్న ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను ఎవరికి వస్తే వారికి పంచుతూ వచ్చారు. మొత్తం 71 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 70 మంది ఎలిమినేట్ అయ్యారు. బరిలో నిలిచిన 62 మంది స్వతంత్ర అభ్యర్థులందరికీ కలిపి మొత్తం 5,966 ప్రథమ ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. మిగిలిన 9 మంది ప్రధాన పార్టీల అభ్యర్థులకు 3,60,377 ఓట్లు వచ్చాయి.
ఈ నెల 17వ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు లెక్కింపు ప్రక్రియ మొదలైనప్పటికీ ఓట్ల లెక్కింపు సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమైంది. మొత్తం ఏడు రౌండ్లలో చేపట్టిన తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తూ అత్యధిక ఓట్లను సాధించారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి మొత్తం 1,10,840 ఓట్లు వచ్చాయి. తీన్మార్ మల్లన్న 83,290 ఓట్లతో ద్వితీయ స్థానంలో, కోదండరామ్ 70,072 ఓట్లతో తృతీయ స్థానంలో నిలిచారు.
బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి రాములునాయక్, సీపీఐ అభ్యర్థి జయసారథిరెడ్డి, చెరుకు సుధాకర్, రాణీరుద్రమరెడ్డి వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అయితే.. మొత్తం పోలైన ఓట్లలో 21,636 చెల్లని ఓట్లు పోగా మిగిలిన 3,66,333 ఓట్లలోంచి సగానికి ఒకటి ఎక్కువ అంటే 1,83,167ను గెలుపు కోటాగా నిర్ధారించారు.మొత్తం 71 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 69 మంది ఎలిమినేట్ అయ్యారు. బరిలో నిలిచిన 62 మంది స్వతంత్ర అభ్యర్థులందరికీ కలిపి మొత్తం 5,966 ప్రథమ ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. మిగిలిన 9 మంది ప్రధాన పార్టీల అభ్యర్థులకు 3,60,377 ఓట్లు వచ్చాయి.
టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎస్ వాణీదేవి మొత్తం 56.17 శాతం ఓట్లతో గెలుపు
హైదరాబాద్-మహబూబ్‌నగర్-రంగారెడ్డి స్థానం పరిధిలో 5,31,268 మంది పట్టభద్రులు తమ ఓటును నమోదు చేసుకున్నారు. కానీ 3,58,348 (67.45శాతం) మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీటిలో 5.94 శాతం ఓట్లు చెల్లలేదు. ఏడు రౌండ్లలో జరిగిన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో మొదటి నుంచి వాణీదేవి ఆధిక్యత ప్రదర్శించారు. ఆమెకు 33.43 శాతం, రాంచందర్‌రావుకు 31.05, స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు 15.90 శాతం ఓట్లు వచ్చాయి. గెలుపునకు చెల్లిన ఓట్లలో 50శాతానికి మించి ఒక ఓటు రావాలి.
Here's MLC Results Update
Big congratulations to Surabhi Vani Devi Garu & Palla Rajeshwar Reddy Garu on emerging victorious in the graduate MLC elections. @PRRTRS @SurabhiVaniDevi @TelanganaCMO @KTRTRS @RaoKavitha pic.twitter.com/psJ03gPeBh
— Koppulaeshwar (@Koppulaeshwar1) March 20, 2021
అనగా చెల్లిన 3,37,039 ఓట్లలో 1,68,520 ఓట్లను గెలుపు కోటాగా అధికారులు నిర్ధారించారు.ఇందుకోసం చివరి స్థానంలో నిలిచిన అభ్యర్థులను ఒక్కొక్కరిగా ఎలిమినేట్ చేస్తూ వారికి వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లను ఇతరులకు కలుపుతూ రెండో రౌండ్ లెక్కింపు మొదలుపెట్టారు. ఇందులో కూడా వాణీదేవికే ఎక్కువ ఓట్లు వచ్చాయి. కానీ కోటా ఓట్లు ఎవరికీ రాలేదు. ఎలిమినేషన్‌లో భాగంగా 91 మందిని తొలగించిన తర్వాత కూడా ఎవరికీ కోటా ఓట్లు రాకపోవడంతో మూడో స్థానంలోని ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను కూడా ఎలిమినేట్ చేశారు.
ఆయనకు దక్కిన 53,610 మొదటి ప్రాధాన్యత ఓట్లలో టీఆర్‌ఎస్ అభ్యర్థి వాణీదేవికి 21,259 (39.65 శాతం) ఓట్లు రెండో ప్రాధాన్యతగా రావడం విశేషం. దీంతో ఆమెకు దక్కిన ఓట్ల సంఖ్య 1,49,269కి పెరిగింది. అప్పటికి కోటా ఓట్లు రాకపోవడంతో రెండో స్థానంలోని బీజేపీ అభ్యర్థి రాంచందర్‌రావు బ్యాలెట్ పేపర్‌లో వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ఆయనకు మొదటి ప్రాధాన్యమిచ్చిన ఓటర్లలో 40,070 మంది వాణీదేవికి రెండో ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో ఆమె ఓట్ల సంఖ్య 1,89,339కి చేరింది. మొత్తం పోలైన ఓట్లలో ఏకంగా 56.17 శాతం ఓట్లను సాధించిన వాణీదేవిని విజేతగా ప్రకటించారు.
స్వతంత్ర అభ్యర్థిగా ముచ్చెమటలు పట్టించిన మల్లన్న
ఇక వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి తీన్మార్ మల్లన్న ముచ్చెమటలు పట్టించారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన చివరి వరకు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఓటమి పాలయ్యారు. కౌంటింగ్ కేంద్రం వద్ద గత రాత్రి విలేకరులతో ఆయన మాట్లాడుతూ గెలిచిన రాజేశ్వర్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాజేశ్వర్‌రెడ్డి తన గెలుపు కోసం రూ. 100 కోట్లు ఖర్చు పెట్టారని అన్నారు. దొంగ ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. మూడు శాతం ఓట్లతో గెలిచిన పల్లాకు శుభాకాంక్షలు చెబుతున్నట్టు పేర్కొన్నారు.
సామాన్యుడినైన తనను తెలంగాణ ప్రజలు భుజానికి ఎత్తుకున్నారని అన్నారు. తన గెలుపు కోసం నిండు గర్భిణి తన ఆపరేషన్‌ను సైతం వాయిదా వేసుకుందన్నారు. ఈ ఎన్నికల్లో వందకు వందశాతం ప్రజలే గెలిచారని, ఇలా చూసుకుంటే మల్లన్న విజయం సాధించినట్టేనని అన్నారు. ప్రగతి భవన్ గోడలు బద్దలయ్యే రోజు ఎంతో దూరంలో లేదని, సామాన్యుడిని సీఎం కుర్చీలో కూర్చోబెడతామని పేర్కొన్నారు. సాగర్ ఉప ఎన్నికల్లో పోటీపై త్వరలో నిర్ణయాన్ని వెల్లడిస్తానని మల్లన్న తెలిపారు.
డబ్బుతో నన్ను ఓడించారు: బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, పట్టభద్రులను డబ్బులతో కొన్నారని ఆరోపించారు. చివరికి సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి కల్పించారని మండిపడ్డారు. ఎన్నికల్లో విజయం సాధించిన సురభి వాణీదేవికి శుభాకాంక్షలు తెలిపిన ఆయన ఈ గెలుపు నిజానికి ఆమెది కాదని, ఆమె తండ్రి పీవీ నరసింహారావుదని అన్నారు. కాగా, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణీదేవి రెండో ప్రాధాన్య ఓట్లతో విజయం సాధించారు. ఆమెకు 1,28,010 ఓట్లు రాగా, తన సమీప బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు 1,19,198 ఓట్లు పోలయ్యాయి.
ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిన్నారెడ్డి
డబ్బులు పంచకపోవడం వల్లే తనకు ఓట్లు వేయలేదని, ఇకపై తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిన్నారెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఓట్ల లెక్కింపు జరుగుతున్న సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడారు. డబ్బులు లేకపోతే ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయొద్దని సూచించారు. పట్టభద్రులు కూడా అధికార టీఆర్‌ఎస్‌కు ఓట్లు అమ్ముకోవడం తనకు బాధ కలిగిస్తోందని అసహనం వ్యక్తం చేశారు.
ప్రత్యేక రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని యువత ఎంతో ఆశపడ్డారని, ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాలను కూడా ప్రభుత్వం భర్తీ చేయలేకపోయిందని విమర్శించారు. నిరుద్యోగ భృతి ఇస్తామని 26 నెలలైనా నయా పైసా ఇవ్వలేదని, అయినా యువత వీటన్నింటిని మరిచి రూ.వెయ్యి, రెండు వేలకు ఆశపడి టీఆర్‌ఎస్‌కు ఓటు వేయడం బాధ కలిగించిందన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ డబ్బు, మద్యంతో ప్రభావితం చేసి ఓటు వేయించుకుంటుందని, ఈ సంస్కృతి పోవాలన్నారు.