Telangana Civic Polls 2020 | (Photo-PTI)

Hyderabad, Mar 14: మహబూబ్‌నగర్‌- రంగారెడ్డి- హైదరాబాద్‌, వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్‌కు (Telangana MLC Elections 2021) రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ తెలిపారు. ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగనున్నది.రెండు నియోజకవర్గాల్లో 1,530 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేయగా.. 7,560 మంది సిబ్బందిని నియమించింది.

రెండు నియోజకవర్గాల్లో భారీసంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలవడంతో బ్యాలెట్‌ను దినపత్రిక సైజులో ముద్రించారు. జంబో బ్యాలెట్‌ బాక్సులను రూపొందించారు. మహబూబ్‌నగర్‌- రంగారెడ్డి- హైదరాబాద్‌ నియోజకవర్గంలో 5,31,268 మంది, వరంగల్‌-ఖమ్మం- నల్లగొండ నియోజకవర్గంలో 5,05,565 మంది ఓటుహక్కును (MLC graduate constituency elections) వినియోగించుకోనున్నారు.

మహబూబ్‌నగర్‌- రంగారెడ్డి- హైదరాబాద్‌ నియోజకవర్గం నుంచి 93 మంది, వరంగల్‌- ఖమ్మం- నల్లగొండ నియోజకవర్గంలో 71 మంది పోటీ చేస్తున్నారని గోయల్‌ చెప్పారు. దీంతో పెద్దసైజు బ్యాలెట్‌ పేపర్‌ను తయారుచేశామన్నారు. పోలింగ్‌ సిబ్బంది ఇచ్చిన పెన్నుతోనే ఓటరు.. అభ్యర్థులకు సంబంధించిన గడుల్లో ప్రాధాన్యతా నంబర్లు వేయాల్సి ఉంటుందని తెలిపారు. కరోనా నేపథ్యంలో కొవి డ్‌ నిబంధనలు పాటిస్తూ ఏర్పాట్లుచేశామని, మాస్క్‌ ఉన్న ఓటర్లనే కేంద్రంలోకి అనుమతిస్తామని చెప్పారు.

విశాఖ ఉక్కుతో నీకేం పని అంటారా ? మేం ముందు భారతీయులమని తెలుసుకోండి, బీజేపీపై మండిపడిన తెలంగాణ మంత్రి కేటీఆర్, విశాఖ ఉక్కు దీక్షా శిబిరానికి మంత్రిని ఆహ్వానించిన ఉక్కు పరిరక్షణ కమిటీ నాయకులు

కేంద్రాల వద్ద శానిటైజర్‌ను అందుబాటులో ఉంచడంతోపాటు, ఓట ర్లు భౌతికదూరం పాటించేలా మార్కింగ్‌చేసినట్టు వివరించారు. కొవిడ్‌ పేషెంట్లు, 80 ఏండ్ల వృద్ధులు, దివ్యాంగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా అవకాశం కల్పించామనిచెప్పారు. ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు. ఆదివారం సెలవు దినం కావడంతో అందరూ ఓటింగ్‌లో పాల్గొనే అవకాశమున్నదని చెప్పారు. పోలింగ్‌ ప్రశాంత నిర్వహణకు పోలీసుల ఆధ్వర్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్టు సీఈవో తెలిపారు.

రెండు నియోజకవర్గాల పరిధిలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు శాంతి భద్రతల అడిషనల్‌ డీజీ జితేందర్‌ తెలిపారు. 15 వేల మందికిపైగా సిబ్బందిని బందోబస్తు విధుల్లో నియమించినట్టు చెప్పారు. సున్నితమైన ప్రాం తాల్లో అవసరం మేరకు అదనపు బలగాలను అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు.

ఈ నెల 17న (బుధవారం) ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలోని 8 హాళ్లలో 56 టేబుళ్లు ఏర్పాటు చేసి ‘హైదరాబాద్‌’స్థానానికి సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. నల్లగొండలోని మార్కెట్‌ శాఖ గిడ్డంగిలో ‘నల్లగొండ’ ఓట్లను లెక్కించనున్నారు. ఇక్కడ కూడా 8 హాళ్లలో 56 టేబుళ్లను ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాటు చేయనున్నారు.

మార్చి 15 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు, గ‌త బ‌డ్జెట్ కంటే మెరుగ్గా ఈసారి బ‌డ్జెట్‌, 18న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేసీఆర్ సర్కారు

హైదరాబాద్‌’ స్థానం నుంచి సురభి వాణిదేవి (టీఆర్‌ఎస్‌), ఎన్‌.రామచందర్‌రావు (బీజేపీ), జిల్లెల చిన్నారెడ్డి (కాంగ్రెస్‌), ఎల్‌.రమణ (టీడీపీ), మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌రావు (స్వతంత్ర అభ్యర్థి)లతో సహా 93 బరిలో ఉన్నారు. నల్లగొండ’ స్థానం నుంచి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి (టీఆర్‌ఎస్‌), ఎస్‌.రాములునాయక్‌ (కాంగ్రెస్‌), గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి (బీజేపీ), బి.జయసారధి రెడ్డి (సీపీఐ), ప్రొఫెసర్‌ ఎం.కోదండరాం (టీజేఎస్‌), రాణిరుద్రమ (యువ తెలంగాణ), చెరుకు సుధాకర్‌ (తెలంగాణ ఇంటి పార్టీ)లతో సహా మొత్తం 71 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీపడుతుండటం, భారీసైజు బ్యాలెట్‌ పేపర్‌ను వినియోగిస్తుండటంతో ఓటర్లు తమ ప్రాధాన్యతల ఆధారంగా అభ్యర్థుల పేర్లను వెతకడం కొంచెం కష్టంగా మారనుంది.

శాసనమండలి పట్టభద్రుల కోటాలో జరిగే ఈ రెండుస్థానాలను అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ‘వరంగల్‌- ఖమ్మం- నల్లగొండ’లో మరోమారు విజయం సాధించాలని, ఒక్కసారి కూడా గెలుపొందని ‘హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌’ స్థానంలో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలగా ఉంది. దివంగత మాజీ ప్రధాని పీవీ కూతురు సురభి వాణీదేవిని ఈ స్థానంలో అభ్యర్థిగా నిలిపిన టీఆర్‌ఎస్‌ ఆమె గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది.

హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌’ పట్టభద్రుల స్థానంలో సిట్టింగ్‌ ఎమ్మెల్సీ ఎన్‌.రామచందర్‌రావు బీజేపీ తరఫున మళ్లీ బరిలోకి దిగారు. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఫలితాలతో ఊపు మీదున్న బీజేపీ దూకుడుకు కళ్లెం వేయాలంటే ‘హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌’ స్థానాన్ని చేజిక్కించుకోవాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. మరోవైపు ఈ రెండు పట్టభద్రుల స్థానాలు 77 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉండటమేకాక వీటిలో 64 చోట్ల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఎన్నికల ఫలితాలు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుకు పరీక్షగా మారాయి. పార్టీ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో మోహరించిన టీఆర్‌ఎస్‌ సాధారణ ఎన్నికల స్థాయిలో ప్రచారాన్ని హోరెత్తించింది.

హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌’ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో 2007, 2009, 2015లో మూడు పర్యాయాలు ఎన్నికలు జరగ్గా 2007, 2015లలో మాత్రమే టీఆర్‌ఎస్‌ పోటీ చేసింది. 2015లో ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్‌ టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి విజయం సాధించేందుకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ పర్యవేక్షణలో ఏకంగా 9 మంది మంత్రులు ఈ నియోజకవర్గం పరిధిలో మకాం వేసి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ నుంచి మాజీమంత్రి చిన్నారెడ్డి, స్వతంత్ర అభ్యర్థి మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌తోపాటు మొత్తం 93 మంది పోటీ చేస్తున్నారు.