Hyd, Nov 14: మునుగోడు ఉప ఎన్నిక ముగిసి వారం రోజులు దాటినప్పటికీ అక్కడ రాజకీయ వేడీ మాత్రం తగ్గలేదు. మునుగోడులో బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధర్నాకు దిగారు. గొర్రెల పంపిణీ డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన (Komatireddy Rajagopal Reddy) రెండు గంటలకుపైగా రోడ్డుపై బైఠాయించారు. దీంతో రాజగోపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు చేసి పోలీసు వాహనంలో తీసుకెళ్తుండగా బీజేపీ కార్యకర్తలు వాహనానికి అడ్డుపడ్డారు. ఉద్రిక్తత నడుమ రాజగోపాల్‌రెడ్డిని అరెస్ట్ చేసి (Police Arrested BJP leader) పోలీస్ స్టేషన్ తరలించారు.
ఇక గెలుపు తర్వాత మొదటిసారిగా నియోజకవర్గానికి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా చండూరులో టీఆర్‌ఎస్ భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది.అదే సమయంలో మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గొల్లకురుమలకు సబ్సిడీ డబ్బులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.
ఉప ఎన్నిక సందర్భంగా నేరుగా లబ్ధిదారులకు సబ్సిడీ ఇస్తామన్న ప్రభుత్వం.. ఇప్పుడు తాత్సారం చేస్తోందని రాజగోపాల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరుపార్టీల కార్యకర్తల నినాదాలతో మునుగోడులో రాజకీయ వేడి రాజుకుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు. టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల నినాదాలతో మునుగోడులో ఉద్రిక్తత నెలకొంది.