Hyd, Jan 7: ఫార్ములా ఈ-కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన సంగతి విదితమే.ఈ విషయంపై నందినగర్‌లోని తన నివాసంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ..హైకోర్టు క్వాష్ పిటిషన్‌ను కొట్టేయగానే ఏదో జరిగినట్టు కాంగ్రెస్ నేతలు శునకానందం (KTR Slams CM revanth Reddy) పొందుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు.
పచ్చ కామెర్ల వారికి లోకమంతా పచ్చగా కనబడుతది అంటా.. అవినీతిపరులకు, రూ. 50 లక్షలతో దొరికిన దొంగలకు పొలికటిక్ బ్రోకర్లకు ప్రతి కార్యక్రమంలో ఎంతో కొంత చేతులు మారిందనే ఒక మూర్ఖపు తెలివి, తక్కువ ఆలోచన ఉంటది. అది స్వతహాగానే పుర్రెలో పుట్టింది పోదనన్నట్టు పుట్టుకతో వచ్చిన బుద్ధి అది అని కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
పొద్దుట్నుంచి కాంగ్రెస్ నాయకుల హడావుడి చేస్తున్నారు. భారత పౌరుడిగా, రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా ఇది అక్రమ కేసు అని చెబుతున్నాను. ఏదో జరిగిందని చూపేట్టే కక్ష సాధింపు కేసులు అని తెలిసీ కూడా ఏసీబీ విచారణకు వెళ్లాను. ఈ కేసు పెట్టి, కథలు అల్లి శునకానందం పొందుతున్న చిట్టి నాయుడికి ఒక మాట చెప్పాల్సి ఉంది.
చట్టాన్ని గౌరవించే పౌరుడిగా.. నువ్వు అక్రమ కేసులు పెడితే.. బురద జల్లితే న్యాయపరంగా, రాజ్యంగా పరంగా ప్రతి హక్కును వినియోగించుకుంటాను. ఏసీబీ విచారణకు లాయర్‌ను తీసుకెళ్తానంటే నువ్వు భయపడ్డావు. ప్రశ్నలు అడిగేందుకు నీ ప్రభుత్వం వెనక్కి పోయింది. ఏసీబీ కేసుపై హైకోర్టులో పిటిషన్ వేశాను.. తప్పు ఎఫ్ఐఆర్.. ఇష్టమొచ్చినట్లు సెక్షన్లు పెట్టారని వాదించాం.
కానీ హైకోర్టు క్వాష్ పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో నాకు ఉరి శిక్ష వేశారు.. నేరారోపణ రుజువైందని అని సంకలు గుద్దుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇది ప్రారంభమే.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిన్ వేశాం. అది కూడా విచారణకు వస్తది అక్కడ న్యాయ పోరాటం చేస్తాను అని కేటీఆర్ తేల్చిచెప్పారు.
KTR Tweet on Formula-E Race Case
Mark my words, Our comeback will be stronger than this setback
Your lies won't shatter me
Your words won't diminish me
Your actions won't obscure my vision
This cacophony won't silence me!
Today's obstacles will give way to tomorrow's triumph.
Truth will shine brighter with…
— KTR (@KTRBRS) January 7, 2025
కాగా ఫార్ములా-ఈ కేసు వ్యవహారంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ తనపై పెట్టిన కేసును కొట్టివేయాలంటూ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పును కేటీఆర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో కేటీఆర్ తరఫు న్యాయవాది మోహిత్‌రావు పిటిషన్ వేశారు.
మరో వైపు ఫార్ములా-ఈ కార్ రేసు వ్యవహారంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియెట్ పిటిషన్ దాఖలు చేసింది. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనలు కూడా వినాలని పిటిషన్‌లో కోరింది.
ఇక ఈడీ మరోసారి కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న తమ ఎదుట హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. ఇలా ఈ కేసు వ్యవహారంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా కేటీఆర్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. "నా మాటలు రాసిపెట్టుకోండి. ఎదురుదెబ్బల నుంచి బలంగా పుంజుకుంటాం. మీ అబద్ధాలు నన్ను అడ్డుకోలేవు. మీ ఆరోపణలు నన్ను తగ్గించలేవు. మీ చర్యలు నా దృష్టిని మరుగుపరచలేవు. మీ కుట్రలు నా నోరు మూయించలేవు. నేటి అడ్డంకులే రేపటి విజయానికి నాంది. సత్యం కాలంతో పాటు ప్రకాశిస్తుంది. నేను మన న్యాయవ్యవస్థను గౌరవిస్తాను. న్యాయం గెలుస్తుందని నా అచంచలమైన నమ్మకం. సత్యం కోసం నా పోరాటం కొనసాగుతుంది. త్వరలో ప్రపంచం కూడా దానికి సాక్ష్యమవ్వనుంది" అని కేటీఆర్ ట్వీట్ చేశారు.