Hyd, Jan 14: హుజూరాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కోర్టులో భారీ ఊరట లభించింది. మంగళవారం ఉదయం ఆయనకు బెయిల్ లభించింది. మూడు కేసుల్లో బెయిల్ మంజూరు చేశారు న్యాయమూర్తి. జిల్లా సమీక్షా సమావేశంలో తోటి ఎమ్మెల్యేతో దురుసుగా ప్రవర్తించారని ఆయనపై కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే.
ఆదివారం కరీంనగర్(Karimnagar) కలెక్టరేట్‌లో మంత్రులు నిర్వహించిన సమీక్ష సందర్భంగా.. కౌశిక్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్(Sanjay)ల మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుని సమావేశం రసాభాసగా మారిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై ఫిర్యాదులు అందడంతో కౌశిక్‌రెడ్డిపై కరీంనగర్ ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ పోలీసులు సోమవారం సాయంత్రం హైదరాబాద్ వచ్చి కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేసి తీసుకెళ్లారు.
పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన కరీంనగర్ పోలీసులు, డాక్టర్ సంజయ్‌పై పరుష పదజాలం..అదుపులోకి
రాత్రంతా ఆయన త్రీటౌన్ పోలీస్టేషన్‌లో ఉన్నారు. ఈ ఉదయం వైద్య పరీక్షల అనంతరం పాడి కౌశిక్‌రెడ్డిని (Padi kaushik Reddy) రెండో అదనపు అదనపు మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. 3 కేసుల్లో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. గురువారం లోగా రూ.2 లక్షలు పూచీకత్తు సమర్పించాలని ఆదేశాలిచ్చారు. పోలీసులు పిలిచిన సమయంలో విచారణకు హాజరు కావాలని చెప్పారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయనని కోర్టుకు కౌశిక్‌రెడ్డి చెప్పారు. బెయిల్‌పై విడుదలైన కౌశిక్ రెడ్డి మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండానే వెళ్లిపోయారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలిపి, హైదరాబాద్ వచ్చాక అన్ని వివరాలు వెల్లడిస్తానని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వెళ్లిపోయారు.