Khanapur MLA Rekha Naik Resigns to BRS (Photo-X)

Hyd, Oct 6: ఖానాపూర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌ బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ఇదే సమయంలో తాను వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉంటానని.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎలా గెలుస్తారో చూస్తాను అంటూ ‍స్ట్రాంగ్‌ కౌంటరిచ్చారు. అలాగే, కేసీఆర్ మాట తప్పారు.. కేటీఆర్‌ చేసిన మోసాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రేఖా నాయక్‌ శుక్రవారం ఖానాపూర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నేను బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నాను. బీఆర్‌ఎస్‌ పార్టీలో ఒక మహిళకు అన్యాయం జరిగింది. నన్ను మోసం చేశారు. ప్రజలను మోసం చేస్తున్నారు. కేటీఆర్‌ స్నేహితుడని జాన్సన్‌ నాయక్‌కు టికెట్‌ ఇచ్చారు. నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. నేనేం తప్పు చేశానో చెప్పాలి. నేను భూములు కబ్జా చేశానా?.. అది నిరూపించండి అంటూ సవాల్‌ విసిరారు. ఏం లూటీలు చేశానో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

 వీడియో ఇదిగో, గన్‌మెన్‌ చెంప చెల్లుమనిపించిన తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ

ఇదే సమయంలో కేటీఆర్‌.. తన స్నేహితుడు జాన్సన్‌ కోసం అభివృద్ధి పనులను ఆపేశారు. సీఎం కేసీఆర్ ఖానాపూర్‌ సదర్ మట్ నిర్మిస్తామన్నారు. రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామన్నారు. కానీ, ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ తప్పారు. నా నియోజకవర్గానికి కేటాయించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను నిర్మల్‌, బోథ్‌కు తరలించారు. నా నిధులు ఆపినందుకు నేను పోరాటానికి వెళ్తున్నాను. ఖానాపూర్‌ను అభివృద్ధి చేయలేదని కేటీఆర్‌ ఒప్పుకున్నారు.

వచ్చే ఎన్నికల్లో పోటీలోనే ఉంటాను. నేను ప్రజలకు చేసిన మంచిని వారికి చెబుతాను. అన్యాయంగా మా అల్లుడిని బదిలీ చేశారు. బీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్తాను. పాదయాత్రకు నేను రెడీ అవుతున్నాను. గ్రామ గ్రామాన పాదయాత్రతో ప్రజలను కలుస్తాను. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎలా గెలుస్తాడో చూస్తాను. బీఆర్‌ఎస్‌ను ఓడించడమే నా లక్ష్యం. జాన్సన్‌ ఎస్టీ కాదు అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇప్పుడు నేను ఏడుస్తున్నా.. రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఏడిపిస్తా.. అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.