Hyd, Mar 14: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం (TSPSC Paper Leak Case) మలుపులతో తిరుగుతోంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. మరికొందరు పరారీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులను రంగంలోకి దించారు. టీఎస్‌పీఎస్‌సీ (TSPSC) ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వ విభాగాల్లో ఏఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రవీణ్‌ను ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్న విషయం తెలిసిందే.
తాజాగా ప్రధాన నిందితుడు ప్రవీణ్ విచారణ సమయంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతడు గ్రూప్-1 పరీక్ష రాసినట్లు వెల్లడైంది. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో ప్రవీణ్‌కు 103 మార్కులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రిలిమ్స్ పేపర్‌ను అతడు లీక్‌చేశాడా? అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు.
ప్రవీణ్ రాసిన పేపర్‌తో పాటు అతడికి వచ్చిన కోడ్ ప్రశ్నపత్రాన్ని పోలీసులు, టీఎస్‌పీఎస్సీ అధికారులు పరిశీలిస్తున్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాలు వచ్చిన సర్వర్‌ను సైబర్ నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు. పేపర్ లీక్ అయిందా? లేదా? అనే కోణంలో సైబర్ నిపుణులు తనిఖీ చేస్తున్నారు. అసలు ప్రవీణ్‌కి 150కి గానూ 103 మార్కులు వచ్చేంత ప్రతిభా పాటవాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
నిందితుడు ప్రవీణ్ 2017లో టీఎస్‌పీఎస్‌సీలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరి నాలుగేళ్ల పాటు వెరిఫికేషన్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న క్రమంలోనే అక్కడికి వచ్చే మహిళల ఫోన్ నంబర్లను నిందితుడు తీసుకునేవాడని తేలింది. దరఖాస్తులోని సాంకేతిక సమస్యలను పరిష్కరించి సదరు మహిళలతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు.
పలువురు మహిళలలో శారీరక సంబంధం కూడా పెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రవీణ్ సెల్‌ఫోన్‌లో ఎక్కువగా మహిళల నంబర్లు, వాట్సాప్ చాటింగ్‌లోనూ మహిళల నగ్న ఫొటోలు, వాట్సాప్‌లో న్యూడ్ చాటింగ్‌లు ఉండడాన్ని గుర్తించారు. ఏఈ పరీక్ష పత్రం కూడా రేణుక కారణంగానే లీక్ అయిందని పోలీసులు తేల్చారు. ఏఈ పరీక్ష పేపర్లు తీసుకుని నెల 2న రూ.5 లక్షలు ఇచ్చిన రేణు, ఆమె భర్త.. మరోసారి 6న తేదీన ప్రవీణ్‌ను కలిసి ప్రశ్నపత్రాల కాపీలతోపాటు మరో రూ.5 లక్షలు ఇచ్చారని విచారణలో తేలింది.
పేపర్ల లీకేజీపై (Telangana Public Service Commission paper leak) అనుమానం వచ్చిన టీఎస్‌పీఎస్సీ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎస్.రఘునాథ్ నేతృత్వంలోని బృందం.. ప్రవీణ్, రాజశేఖర్, రేణుక, లవుడ్యావత్ డాక్యా, రాజేశ్వర్, నీలేశ్, గోపాల్, శ్రీనివాస్, రాజేందర్‌లను అరెస్టు చేసింది. వారి నుంచి పెన్‌డ్రైవ్‌లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంది.
ప్రవీణ్ పెన్‌డ్రైవ్‌ను పరిశీలించిన పోలీసులు.. అందులో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష పేపర్ ఉందని, దాన్ని విక్రయించడానికి ప్రయత్నించాడని గుర్తించారు. ప్రవీణ్ కంప్యూటర్‌ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఆ నివేదిక అందిన తర్వాత.. అతను, రాజశేఖర్ ఎవరెవరి కంప్యూటర్లను యాక్సస్ చేశారు? ఏమేం పేపర్లు డౌన్‌లోడ్ చేశారనేది తేలుతుందని డీసీపీ వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ)(TSPSC)లో పేపర్ల లీకేజీ వ్యవహారంపై దర్యాప్తును ముమ్మరం చేసినట్లు అదనపు సీపీ విక్రమ్‌సింగ్ తెలిపారు. కేసు దర్యాప్తుపై విక్రమ్‌సింగ్ వివరణ ఇస్తూ.. ‘‘గ్రూప్-1 (Group-1) పేపర్ లీక్ అయినట్లు మా దృష్టికి రాలేదు. ఇప్పటివరకు ఎవరూ ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. దర్యాప్తులో భాగంగా నిందితుడు ప్రవీణ్ సెల్‌ఫోన్‌లో ఏడుగురి మహిళల నగ్న చిత్రాలను గుర్తించాం. సెల్‌ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాం. ప్రస్తుతం ఏఈ పేపర్ లీకేజీకి సంబంధించిన కేసు దర్యాప్తు మాత్రమే కొనసాగుతోంది. ఇప్పటివరకు ప్రవీణ్‌తో పాటు 9 మందిని అరెస్టు చేశాం. వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నాం’’ అని విక్రమ్‌సింగ్ స్పష్టం చేశారు.
ఉద్యోగులు ఇద్దరిపై వేటు
అసిస్టెంట్ ఇంజనీర్ పేపర్ల లీక్ వ్యవహారంలో ఇద్దరు ఉద్యోగులపై టీఎస్‌పీఎస్సీ వేటు వేసింది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్‌కుమార్‌ను సస్పెండ్ చేయడంతోపాటు శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. ఔట్‌సోర్సింగ్ విధానంలో కంప్యూటర్ నెట్‌వర్క్ ఎక్స్‌పర్ట్‌గా పనిచేస్తున్న రాజశేఖర్‌రెడ్డిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించింది.
కేసు కథ అసలు ఎక్కడ మొదలైందంటే..
ప్రభుత్వ విభాగాల్లో 837 అసిస్టెంట్ ఇంజినీరు పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన రాతపరీక్ష ప్రశ్నపత్రం లీకైందన్న సమాచారంతో నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఈ నెల 5న జరిగిన ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 74 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. దాదాపు 55 వేల మంది హాజరయ్యారు. తొలుత ఈ నెల 12న నిర్వహించాల్సిన టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్(టీపీబీవో) పరీక్ష ప్రశ్నపత్రాలు లీకయ్యాయని భావించారు. కానీ, ఏఈ పరీక్ష ప్రశ్నపత్రాలు లీకైనట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితులు కంప్యూటర్ నుంచి కాపీ చేసిన ఫోల్డర్‌లో ఏఈ పరీక్ష ప్రశ్నపత్రాలతో పాటు భవిష్యత్తులో జరగాల్సిన పరీక్షల ప్రశ్నపత్రాలు కూడా ఉన్నట్లు తెలిసింది. నిందితుల ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిలోని సమాచారం ఆధారంగా పలువురు వ్యక్తులను విచారిస్తున్నారు.
నియామక పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం రెండు నెలల ముందుగానే సిద్ధమవుతుంది. ప్రశ్నపత్రాలన్నింటినీ సాఫ్ట్‌కాపీ రూపంలో భద్రపరుస్తారు. ప్రశ్నల పక్కనే వాటి జవాబులుంటాయి. అసిస్టెంట్ ఇంజినీరు ప్రశ్నపత్రాన్ని తస్కరించే క్రమంలో కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లోని ప్రశ్నపత్రాల ఫోల్డర్‌ను నిందితులు డౌన్‌లోడ్ చేశారు. ఇందులో ఏఈ ప్రశ్నపత్రంతో పాటు భవిష్యత్తులో జరగాల్సిన పరీక్షలకు సంబంధించినవీ ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో కాపీ చేసి భద్రపరిచిన హార్డ్ డిస్క్, ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఫోల్డర్‌ను ఫిబ్రవరి 25 లేదా 28న డౌన్‌లోడ్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితుల కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లను ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పోలీసులు పంపించారు. ఆ నివేదిక వస్తే మరిన్ని విషయాలు బయటపడనున్నాయి. ఏ రోజు ఫోల్డర్‌ను ఎప్పుడు డౌన్‌లోడ్ చేశారన్న ఆధారాలు లభిస్తే మరింత స్పష్టత రానుంది.
అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు జరిగిన రాతపరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయినట్లు బయటపడటంతో టీఎస్‌పీఎస్సీ మంగళవారం అత్యవసరంగా సమావేశం కానుంది. పరీక్షను రద్దు చేయాలా? లేదా ఇద్దరికే లీక్ అయిన నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై న్యాయనిపుణుల సలహాలు, సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నట్లు కమిషన్ వర్గాలు వెల్లడించాయి. టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలనూ రద్దు చేసినట్లు స్పష్టంచేశాయి.