Coronavirus Outbreak (Photo Credits: IANS)

Hyderabad, Sep 6: తెలంగాణలో తాజాగా 2,574 కరోనా పాజిటివ్‌ (Telangana Covid 19) కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,40,969కు (Corona Cases) చేరాయి. గత 24 గంటల్లో కరోనాతో 9 మంది మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 886కు (Corona Deaths) చేరింది. కోవిడ్ వైరస్‌ నుంచి కొత్తగా 2,927 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటి వరకు 1,07,530 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 32,553 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.62శాతం ఉండగా, దేశంలో 1.71శాతం ఉందని వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. అలాగే రాష్ట్రంలో రికవరీ రేటు 76.2శాతంగా ఉందని చెప్పింది.25,449 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపింది.

శనివారం ఒకే రోజు 62,736 శాంపిల్స్‌ టెస్ట్‌ చేయగా.. ఇప్పటికీ 17,30,389 శాంపిల్స్‌ టెస్ట్‌ చేసినట్లు వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇంకా 3,129 శాంపిల్స్‌ రావాల్సి ఉందని చెప్పింది. 10లక్షల జనాభాకు 46,608 టెస్టులు చేస్తున్నట్లు వివరించింది. కాగా, తాజాగా నమోదైన 2,574 కేసులో హైదరాబాద్‌లో 325 నిర్ధారణ అయ్యాయి. తర్వాత రంగారెడ్డిలో 197, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి 185, నల్గొండ 158, కరీంనగర్‌ 144, ఖమ్మం 128, వరంగల్‌ అర్బన్‌ 117, సూర్యపేట 102 అత్యధికంగా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యాయి.

తాజాగా 90,633 మందికి కరోనా వైరస్, దేశంలో 41,13,812కు చేరుకున్న మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య, ఒక్కరోజే 1065 మంది మృత్యువాతతో 70,626 కు చేరిన మరణాల సంఖ్య

ఇదిలా ఉంటే హైద‌రాబాద్ నుంచి సొంతూరుకు వ‌చ్చిన ఓ కుటుంబానికి కోవిడ్ భ‌యంతో ఊరి జ‌నాల‌తో పాటు, బంధువులు ఆశ్ర‌యం క‌ల్పించ‌ని వైనం న‌ల్ల‌గొండ జిల్లా క‌ట్టంగూర్ గ్రామంలో చోటుచేసుకుంది. దీంతో విధిలేని ప‌రిస్థితుల్లో స‌ద‌రు కుటుంబం త‌మ పొలంలోనే క‌వ‌ర్ల‌తో చిన్న గుడిసెను ఏర్పాటు చేసుకుని అందులోనే గ‌త రెండు నెల‌లుగా జీవిస్తోంది.

క‌ట్టంగూర్ గ్రామానికి చెందిన య‌ర్క‌ల యాద‌గిరి 30 ఏండ్ల క్రితం జీవ‌నోపాధి నిమిత్తం హైద‌రాబాద్‌కు వ‌ల‌స వెళ్లాడు. అక్కడ డ్రైవ‌ర్‌గా ప‌నిచేసేవాడు. ఇటీవ‌లే బ్యాంక్ లోన్ తీసుకుని రెండు మినీ బ‌స్సుల‌ను కొనుగోలు చేశాడు. అయితే కోవిడ్‌-19 లాక్‌డౌన్ కార‌ణంగా అతని ఆశలు అడియాసలయ్యాయి. నెలకు ఇంటి అద్దె కట్టలేని పరిస్థితి రావడంతో నగరాన్ని ఖాళీ చేసి ఇంటికి వెళ్లాడు. జులై 7న సొంతూరికి చేరుకోగానే బంధువులు, గ్రామ ప్ర‌జ‌లు తిర‌స్క‌రించారు.

దిక్కులేని ప‌రిస్థితుల్లో న‌ల్ల‌గొండ రోడ్‌లోని వ్య‌వసాయ పొలంలోకి వెళ్లి చిన్న గుడిసె వేసుకుని జీవిస్తున్న‌ట్లు తెలిపాడు. గుడిసె వేయ‌క‌ముందు వారం రోజుల‌కు పైగానే మినీ బ‌స్సులో నివ‌సించిన‌ట్లు చెప్పాడు. బంధువుల నుంచి, గ్రామ‌స్తుల నుంచి ఇటువంటి స‌మాధానాలు వ‌స్తాయ‌ని ఎన్న‌డూ ఊహించ‌లేద‌న్నాడు. పొలంలోనే ఇళ్లు నిర్మించుకోవాల‌నుకుంటున్న‌ట్లు వెల్ల‌డించాడు. కాగా త‌న‌ ఆర్థిక ప‌రిస్థితి బాగోలేద‌ని పేర్కొన్నాడు.