Hyderabad, March 31: తెలంగాణలో గడిచిన నాలుగు రోజులుగా ఎండలు (Heat wave)మండిపోతున్నాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం (Telangana Govt)కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్ విద్యార్దులు వడదెబ్బ భారిన పడకుండా స్కూల్ టైమింగ్స్ కుదించింది (Reduce School Timings) ప్రభుత్వం. ఇప్పటికే తెలంగాణలో ఒంటిపూట (Half Day schools)బడులు నడుస్తున్నాయి. తాజాగా ఎండల తీవ్రతతో సమయాల్లో మార్పులు చేసింది. బుధవారం పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు పెరిగాయి. అత్యధికంగా కుమ్రంభీం జిల్లాల్లో కెరిమెరిలో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ క్రమంలో రాష్ట్ర విద్యాశాఖ అప్రమత్తమైంది. గురువారం నుంచి ఉదయం 11.30గంటల వరకే విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచి 11.30గంటల వరకు పాఠశాలలు పనిచేయనున్నాయి. కుదించిన వేళలు వచ్చే నెల 6వ తేదీ వరకు అమలులో ఉంటాయని పేర్కొంది.
ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో ఎండల తీవ్రత నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ సోమేశ్‌కుమార్ (Somesh Kumar) బుధవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత తీవ్రమవుతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎండల ప్రభావం వల్ల కలిగే ప్రమాదాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను చైతన్యం చేయాలని సీఎస్ సూచించారు. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అగ్నిమాపక శాఖను అప్రమత్తం చేయాలని కలెక్టర్లకు సూచించారు.
స్కూళ్ల సమయాలను కుదిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దంచికొడుతున్న ఎండలకు పెద్దవాళ్లే బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. కానీ సమయాన్ని కుదించడంతో ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రంలో మరో ఐదురోజుల పాటూ హీట్ వేవ్ కొనసాగే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.