COVID-19 in Telangana. | PTI Photo

Hyderabad, May 30: తెలంగాణలో కరోనా మహమ్మారి ఒక్కసారిగా పడగ విప్పింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 169 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరోజును మించి మరొక రోజు పెద్దమొత్తంలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న పాజిటివ్ గా నిర్ధారించబడిన 169 కేసుల్లో 100 కేసులు రాష్ట్రం నుంచి నమోదైనవే. మిగతావి ఇతర దేశాల్లో చిక్కుకొని ఇక్కడికి వచ్చిన వారిలో 64 మందికి మరియు వలస కార్మికుల్లో మరో 5 మందికి కరోనా సోకినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయింది.

ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనైతే కరోనావైరస్ విజృంభిస్తుంది. నిన్న అత్యధికంగా 82 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదు కాగా, రంగారెడ్డి జిల్లా నుంచి 14, మెదక్ నుంచి 2 కేసులు మరియు సంగారెడ్డి నుంచి 2 కేసులు నమోదయ్యాయి. అంటే హైదరాబాద్ చుట్టూరా కరోనావైరస్ ఒక వలయంలా ఏర్పడినట్లు అర్థమవుతోంది. గతంలో సీఎం కేసీఆర్,  అధికారులందరూ హైదరాబాద్‌ను రౌండప్ చేసి కరోనాను అంతం చేయాలని ఆదేశించగా, ఇప్పుడు అదే కరోనా హైదరాబాద్‌ను రౌండప్ చేయడం గమనార్హం. హైదరాబాద్‌ను రౌండ్ అప్ చేసి, వైరస్‌ను నిర్మూలించండి: సీఎం కేసీఆర్

ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం తెలంగాణ రాష్ట్రం లోపలే నిన్న కొత్తగా నమోదైన 100 కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 2008 కు చేరింది.

గత 24 గంటల్లో మరో 36 మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1381 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాయ్యారు. మరోవైపు, రాష్ట్రంలో శుక్రవారం మరో 4 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కోవిడ్ మరణాల సంఖ్య 71కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 973 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొంది.

Telangana's #COVID19  Report:

Status of positive cases of #COVID19 in Telangana

 

ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే.. వలస కార్మికుల్లో ఇప్పటివరకు 180 మందికి కరోనా సోకినట్లు నిర్ధారింపబడగా, విదేశాల నుంచి వచ్చిన వారిలో 207 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వీరు కాకుండా మరో 30 మంది విదేశీ కరోనా పేషెంట్స్ కూడా ఉన్నారు. మొత్తంగా తెలంగాణ వెలుపల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 417 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.

ఈ లెక్కన తెలంగాణలో నమోదైన కేసులు 2008కి ఈ 417 కేసులు కూడా కలిపితే తెలంగాణ రాష్ట్రం నిర్వహించిన పరీక్షల్లో ఇప్పటివరకు 2425 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు చెప్పవచ్చు.