
Hyderabad, March 29: తెలంగాణలో కరోనా వైరస్ రెండో దశలోనూ విజృంభిస్తుంది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే విద్యాసంస్థలను మూసివేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాలలో, పనిచేసే చోట మరియు ప్రయాణ సమాయాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిచే వారిపై విపత్తు నిర్వహణ చట్టం 2005, సెక్షన్ 51 నుండి 60 మరియు భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 188 మరియు ఇతర చట్టాల ప్రకారం చర్యలు తీసుకోబడతాయని స్పష్టం చేసింది.
మతపరమైన కార్యక్రమాలైన షాబ్-ఎ-బరాత్, హోలీ, ఉగాది, రామ నవమి, మహావీర్ జయంతి, గుడ్ ఫ్రైడే, రంజాన్ వంటి పండుగల కోసం బహిరంగ ప్రదేశాలలో వేడుకలను అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంట్లో ఉండే వేడుకలు జరుపుకోవాల్సిందిగా సూచించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈసారి కూడా భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలను నిరాండంబరంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటించారు. పరిమిత సంఖ్యలో కోవిడ్ నిబంధనలకు లోబడి ఆగమ శాస్త్ర బద్ధంగా వేడుకను జరుపుతామని ఆయన వెల్లడించారు. కరోనా దృష్ట్యా భక్తులు ఎవరూ శ్రీరామనవమి నాడు సీతారామ కల్యాణాన్ని వీక్షించడానికి భద్రాద్రికి రావొద్దని సూచించారు. ఇప్పటికే కళ్యాణ టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి నగదు రిఫండ్ చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కోవిడ్ కేసుల విషయానికి వస్తే, నిన్న రాత్రి 8 గంటల వరకు 33,930 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 403 మందికి పాజిటివ్ అని తేలింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 146 కేసులు నమోదయ్యాయి. తెరాస నుంచి ఇటీవల ఎమ్మెల్సీ వాణీ దేవికి కూడా కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 3,06,742కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో మరో 2 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,690కు పెరిగింది.
అలాగే ఆదివారం సాయంత్రం వరకు మరో 313 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 3,00,469 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,583 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
ప్రస్తుతం వైద్య సిబ్బందికి, ఫ్రంట్ లైన్ వర్కర్లకు, 60 ఏళ్లు పైబడిన పౌరులకు, అలాగే 45 నుంచి 59 ఏళ్లుండి దీర్ఘకాలిక అనారోగ్యాలు కలిగిన వారికి COVID వ్యాక్సినేషన్ చేస్తున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో సుమారు 11.65 లక్షల డోసుల వ్యాక్సినేషన్ జరిగినట్లు ఆరోగ్యశాఖ తన నివేదికలో పేర్కొంది.