
Hyderabad, April 24: తెలంగాణలో తాజాగా 7,432 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం... ఒక్కరోజులో కరోనాతో 33 మంది ప్రాణాలు (Covid Deaths) కోల్పోయారు. అదే సమయంలో 2,157 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,87,106కి (Covid in Telangana) చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,26,997 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,961గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 58,148 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 1,464 మందికి కరోనా సోకింది.
ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.1శాతం ఉండగా... తెలంగాణలో 0.51శాతం ఉంది. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 83.5 శాతం ఉండగా తెలంగాణలో 86.16 శాతం ఉంది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1464 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,23,84,797 కరోనా టెస్టులు నిర్వహించారు. రాష్ట్రంలో యువత, మధ్య వయసు వారే ఎక్కువగా కరోనాకు గురవుతున్నారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 43%పైగా బాధితులు 21-40 ఏళ్ల మధ్య ఉన్నవారే. 41-70 ఏళ్ల వారు 40 శాతం ఉన్నారు.ఉమ్మడి నల్గొండ జిల్లా, కరీంనగర్, ఇతర జిల్లాల్లో సెకండ్ వేవ్ కరోనా మరింత వేగంగా విజృంభిస్తోంది.
తాజాగా ఇద్దరు జర్నలిస్టులను కరోనా మహమ్మారి బలిగొన్నది. డిచ్‌పల్లి టీవీ5 రిపోర్టర్ వేణుగోపాల్, ధర్పల్లి సాక్షి రిపోర్టర్ శేఖర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, వీరిద్దరూ ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. వారం రోజుల క్రితం వీరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. హోం ఐసోలేషన్‌లో ఉంటూ జాగ్రత్తలు పాటించారు. కానీ రెండు, మూడు రోజుల క్రితం వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. చివరకు ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ రావడంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
దేశంలో అక్కడక్కడ అగ్నిప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్.. వైద్యారోగ్య శాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లలో అగ్నిమాపక వ్యవస్థను సమీక్షించుకుని అప్డేట్‌గా ఉండేలా చూసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రస్తుతం వేసవి కాలం కావడం, దీనికి తోడు అన్ని ఆస్పత్రులు కరోనా రోగులతో నిండి ఉన్న నేపథ్యంలో అగ్నిప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించాలన్నారు.
రోగులు ఎక్కువ ఉన్న గాంధీ, టిమ్స్ లాంటి ఆస్పత్రుల్లో ముందస్తు చర్యల్లో భాగంగా ఫైరింజన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు.యుద్ద విమానాలను ఉపయోగించి తీసుకువస్తున్న ఆక్సిజన్‌ను అవసరం ఉన్న ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్ కి చేరేవిధంగా సమన్వయం చేసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.
కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ వెంటనే హోం ఐసోలేషన్ కిట్స్ అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరినీ మానిటర్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్ని లక్షల మందికి అయిన హోం ఐసోలేషన్ కిట్స్ అందించడానికి వీలుగా కిట్స్ను సమకూర్చాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ప్రజలు కూడా కరోనా నియంత్రణకు పూర్తి సహకారం అందించాలని మంత్రి ఈటల రాజేందర్ తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.