New Delhi, April 24: మే ద్వితీయార్ధం నాటికి భారత్‌లో కరోనా మరణాలు అత్యధికంగా 5,600 వరకు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎంహెచ్‌ఈ అధ్యయనం తెలిపింది. ఏప్రిల్ - ఆగస్టు మధ్య మూడు లక్షల మంది మరణించే ప్రమాదం (Coronavirus deaths in India) ఉందని ఈ నివేదిక పేర్కొంది. ‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (ఐఎంహెచ్‌ఈ) (Institute for Health Metrics and Evaluation (IHME)) జరిపిన అధ్యయనంలో ఈ షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. రానున్న వారాల్లో కరోనా మహమ్మారి ప్రభావం మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని ఐఎంహెచ్‌ఈ పేర్కొంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసులు, మరణాల రేటును బట్టి దీన్ని అంచనా వేసింది. మే 10న అత్యధికంగా 5,600 మరణాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఏప్రిల్ 12- ఆగస్టు 1 మధ్య కొత్తగా 3,29,000 మంది మరణిస్తారని అంచనా వేసింది. దీంతో జులై చివరి నాటికే మొత్తం మరణాలు 6,65,000కు చేరతాయని లెక్క గట్టింది. అయితే, అందరూ మాస్కులు ధరించడం వల్ల మరణాల సంఖ్యను 70 వేల వరకు తగ్గించొచ్చని తెలిపారు.
కరోనా ఇదే స్థాయిలో కొనసాగితే మే 11-15 తేదీల మధ్య వైరస్ వ్యాప్తి గరిష్ట స్థాయికి చేరే అవకాశాలున్నాయని, అప్పటిలోగా యాక్టివ్ కేసుల సంఖ్య 33 నుంచి 35 లక్షలకు చేరుకుంటాయని ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అంతేకాదు, ఏప్రిల్ 25-30 నాటికి ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, తెలంగాణా రాష్ట్రాల్లో కొత్త కేసులు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంటున్నారు.
మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో ఇప్పటికే కొత్త కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. అలాగే మే నెలాఖరు కల్లా ఈ రాష్ట్రాలలో కేసులు తగ్గవచ్చు అని శాస్త్రవేత్తల అంచనా. మే నెలాఖరు వరకు గణనీయంగా తగ్గుతాయి అని ఐఐటీ కాన్పూర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ శాఖ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ తెలిపారు.
తమిళనాడు రాజధాని నగరం చెన్నైలో మే నెలలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత ఉగ్రరూపం దాల్చనుందని, ప్రజలు అప్రమత్తంగా వ్యహరించి వైరస్ నిరోధక నిబంధనలు పాటించాలని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కమిషనర్ ప్రకాష్ తెలిపారు.