
Hyderabad, April 2: తెలంగాణలో ఒకవైపు హీట్ వేవ్, మరోవైపు కోవిడ్ సెకండ్ వేవ్‌తో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ఇతర వైద్యాధికారులతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంధర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కట్టడి చర్యలపై అధికారులతో చర్చించారు. మంత్రి మాట్లాడుతూ.. ఇది గంభీరమైన సమయం, ఎక్కడా అలసత్వం ప్రదర్శించ వద్దు, మరోసారి యుద్ద వాతావరణంలో పని చేయాల్సి ఉందని నొక్కి చెప్పారు. కోవిడ్ మరణాలను వీలైనంత తగ్గించాలని మంత్రి ఈటల వైద్యాధికారులను కోరారు. కరోనా కోసం చికిత్సనందించే ఆసుపత్రుల్లో ఎలాంటి కొరత ఉండకూడదని, అవసరమైతే తాత్కాలికంగా సిబ్బందిని పెంచుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆదివారం కూడా వాక్సిన్ వేయాలని ఆదేశాలు ఉన్నందున వైద్య, ఆరోగ్య సిబ్బంది సెలవులు పెట్టకుండా వారంలో అన్ని రోజులు పని చేయాలని మంత్రి ఈటల అధికారులకు స్పష్టం చేశారు.
ఇక రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే, నిన్న రాత్రి 8 గంటల వరకు 59,343 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 965 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 1927 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 3,09,741కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 254 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 110 కేసులు, రంగారెడ్డి నుంచి 97, నిజామాబాద్ నుంచి 64, నిర్మల్ నుంచి 39 మరియు జగిత్యాల నుంచి 35 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో మరో 5 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,706కు పెరిగింది.
అలాగే గురువారం సాయంత్రం వరకు మరో 312 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 3,01,876 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,159 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
కాగా, తెలంగాణలో లాక్డౌన్ ఎంతమాత్రం ఉండబోదని, ప్రజలు లాక్డౌన్ పట్ల వదంతులు నమ్మవద్దని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది.
ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. హెల్త్ కేర్ సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లతో పాటు 45 ఏళ్లు పైబడిన పౌరులకు టీకాల పంపిణీ జరుగుతోంది.